టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితం అయింది. కేవలం సూర్యకుమార్ యాదవ్ (68: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) మాత్రమే రాణించాడు. దక్షిణాఫ్రికా విజయానికి 120 బంతుల్లో 134 పరుగులు కావాలి.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (15: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్‌లను (9: 14 బంతుల్లో, ఒక సిక్సర్) అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 26 పరుగులు మాత్రమే. ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ (12: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన దీపక్ హుడా (0: 3 బంతుల్లో) ఏకంగా డకౌటయ్యాడు.
సూర్య తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో ఎవరూ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా 19వ ఓవర్లో అవుటయ్యాడు దీంతో టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితం అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి నాలుగు వికెట్లు, వేన్ పార్నెల్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఆన్రిచ్ నోర్జేకు ఒక వికెట్ దక్కింది.