విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వ ప్రమేయంతోనే జరిగిందని పీఎసీ సమావేశంలో జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని నాయకులు మండిపడ్డారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన పీఎసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపై చర్చించారు. పాలక పక్షం అరాచక రీతిలో వెళ్ళడం వల్లే జన గళం వినిపిస్తుందని పీఎసీ సమావేశం అభిప్రాయపడింది. సామాన్యుల ఈతి బాధలను తెలుసుకొంటూ వారిలో ధైర్యాన్ని నింపేలా జనవాణి చేపట్టిందని, పాలకపక్షం దోపిడీ, దౌర్జన్యాలు వెలుగులోకి వస్తాయనే పవన్ విశాఖ పర్యటనను అడ్డుకొనేందుకు కుట్ర జరిగిందని నేతలు అన్నారు.
వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించారని, ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియచేశారని అన్నారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. విశాఖపట్నంలో అక్రమ కేసులు బనాయించి 180 మందిపై వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేశారని, వీరిని రక్షించుకొనే బాధ్యతను స్వీకరిస్తూ 18వ తేదీన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై పీఏసీ సమావేశంలోనూ తీర్మానం ఆమోదం తెలిపారు. ఈ అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన, పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ మరో తీర్మానం చేశారు.
ఖచ్చితంగా ప్రభుత్వ కుట్రే - నాదెండ్ల మనోహర్
విశాఖలో జనసేన నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని, పీఏసీ సమావేశం తరువాత నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన నాయకుల గొంతు నొక్కాలని కుట్ర చేశారని, జనవాణి ద్వారా వారి భూబాగోతాలు బయట పడతాయని భయపడ్డారని అన్నారు. ప్రభుత్వ చర్యలను ముక్త కంఠంతో అందరూ ఖండించారని తెలిపారు. వ్యవస్థలను జగన్ పూర్తిగా దుర్వినియోగం చేశారని, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వారే ఘర్షణ వాతావరణం సృష్టించారని అన్నారు. 98 మందిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఎంత దుర్మార్గమని మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ కేంద్రం బలగాల ఆధీనంలో ఉందని, ఈ రోజు వరకు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను రాష్ట్ర పోలీసులు చట్ట విరుద్దంగా వ్యవహరించారని విమర్శించారు.
ఏడో తేదీన మేము టిక్కెట్లు కొన్నాం, 13వ తేదీన పవన్ పర్యటన సమాచారం ఇచ్చామని, అప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పలేదని అన్నారు. వైసీపీ పెట్టిన గర్జకు లేని నిబంధనలు జనసేనకే ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో ప్రజా స్వామ్యానికి విరుద్దంగా అధికారులు వ్యవహరించారని, అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి మహిళా కానిస్టేబుల్ లేకుండా జనసేన కుటుంబ సభ్యులను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్యలపై పోరాటం చేయాలని, అండగా నిలబడిన అధినేతకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని అన్నారు. వైసీపీ దుశ్చర్యలకు దీటుగా పోరాటం చేసిన వారిని అభినందిస్తూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. జనవాణి కార్యక్రమంలో వచ్చిన 1,670 అర్జీలు ప్రభుత్వ శాఖలకు పంపామని, ఏపీలో 26 జిల్లాల్లో జనవాణి కార్యక్రమం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఏజెన్సీ ప్రాంతాలతో సహా , అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని అన్నారు. సొంత ఇంటి కల నెరవేరకుండా జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారని తెలిపారు. జగనన్న కాలనీల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించ లేదని, కేంద్రం ఇచ్చిన వాటిలో రూ.1,500 కోట్లు దారి మళ్లించిందని ద్వజమెత్తారు.
నవంబర్ 12, 13, 14 తేదీలలో జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై సోషల్ ఆడిట్ చేస్తామని, నవంబర్ 20 కల్లా ఒక నివేదికను మా అధినేత పవన్ కళ్యాణ్ కి అందచేస్తామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక నిపుణులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులను ఎక్కడా అవమానించ వద్దని పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. జగన్ దుర్మార్గపు ఆలోచనలకు పోలీసు యంత్రాంగం బలైపోతుందని అన్నారు. భవిష్యత్తులో జనసేన తరపున పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ వాహనంపై ఐపియస్ అధికారి ఎక్కి ఒత్తిడి చేయడం ఆశ్చర్యం కలిగించిందని, లైట్లు తీసేసి, పవన్ కళ్యాణ్ పై దాడి జరిగేలా జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. జన సైనికులు తమ ఫోన్ టార్చి లైట్ ద్వారా వెలుగును అందించారని, ఈ కుట్రలపై కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు చేయాలని అన్నారు.