Ponguleti :     మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25 లేదా 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక వచ్చే అవకాశం ఉంది. ఈ సభలో ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. అనుచరులతో సహా పొంగులేటి, జూపల్లి.. అగ్రనేతల సమక్షంలోనే హస్తం గూటికి చేరనున్నారు.   బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ ఇరువురి నేతలతో గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నా.. ఏ పార్టీలో చేరుతున్నారనే దానిపై పొంగులేటి, జూపల్లి క్లారిటీ ఇవ్వలేదు.  


రాహు్ గాంధీ టీమ్ జరిపిన చర్చలు సఫలం


కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల పొంగులేటితో చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జూపల్లికి కూడా ప్రాధాన్యం ఇస్తామని హామీ రావడంతో వారు కాంగ్రెస్ లోచేరాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకిటంచే అవకాశం ఉంది. ఇప్పటికే పొంగులేటి పలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.   బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఏకతాటిపైకి తీసుకురావాలనేది పొంగులేటి, జూపల్లి వ్యూహంగా తెలుస్తోంది.   ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉండటం, కర్ణాటక గెలుపుతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండటంతో హస్తం పార్టీలో చేరాలని పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 


పొంగులేటి అనుచరవర్గం అంతా కాంగ్రెస్ లోకే ! 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు.  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 



జూపల్లికి సొంత బలగం - అంతా కాంగ్రెస్ లోకే


మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అచ్చంపేట, గద్వాల, నాగర్​కర్నూల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, మక్తల్ నియోజకవర్గాల్లో సొంత వర్గం ఉంది.  2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున కొల్లాపూర్ లో  పోటీ చేసిన జూపల్లి..  కాంగ్రెస్​ అభ్యర్థి బీరం హర్షవర్ధన్​రెడ్డి చేతిలో ఓడిపోయారు.  హర్షవర్ధన్​రెడ్డి గెలిచిన తర్వాత బీఆర్ఎస్​లో చేర్చుకోవడంలోనూ వీరిద్దరూ కీ రోల్​పోషించారన్న టాక్​ ఉంది. తాజాగా జూపల్లి సస్పెన్షన్​కు గురి కావడంతో..ఉమ్మడి జిల్లాలోని అసమ్మతి నేతలు ఆయనతో టచ్​లోకి వచ్చినట్టు తెలుస్తోంది.  బీఆర్ఎస్​కు ఇటీవల రాజీనామా చేసిన వనపర్తి జడ్పీ చైర్​పర్సన్​ లోక్​నాథ్​ రెడ్డి, పెద్దమందడి మేఘారెడ్డి, వనపర్తి కిచ్చారెడ్డితో జూపల్లి అనుచరులు మాట్లాడారని, తమతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలు్సతోంది.