Tirupati Balaji Temple in J&K:


వర్చువల్‌గా ప్రారంభం..


జమ్ము కశ్మీర్‌లోని ( Jammu And Kashmir) మజీన్ ప్రాంతంలో నిర్మించిన తిరుపతి బాలాజీ (Tirupati Balaji Temple) ఆలయాన్ని కేంద్రహోం మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు. భక్తుల సందర్శనకు ఆలయ తలుపులు తెరిచారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. అమిత్‌షా మాత్రం వర్చువల్‌గా హాజరై...ఆలయాన్ని ప్రారంభించారు. 62 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.25 కోట్లు ఖర్చు పెట్టారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తైంది. జమ్ములోనే ఇది అతి పెద్ద ఆలయంగా రికార్డుకెక్కింది. ఈ ఆలయంతో కశ్మీర్ పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం భావిస్తోంది. జమ్ముకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చొరవ చూపించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)ని అభినందించారు. కేవలం ఆలయాలు కట్టడమే కాకుండా, మత మార్పిడిలనూ టీటీడీ అడ్డుకుంటోందని ప్రశంసించారు. ఒక్క ఏపీలోనే కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆలయాలు నిర్మించారు. హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్‌లలో ఈ టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతిలో ఎలాంటి వ్యవస్థ అయితే ఉందో...అదే కశ్మీర్‌లోని ఆలయానికీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఆలయానికి సమీపంలోనే మాతా వైష్ణోదేవి ఆలయం ఉంది.