RBI MPC: ఈ నెల 6న (మంగళవారం) ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడో రోజు సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. నేటితో ఈ భేటీ ముగుస్తుంది. ఈ 3 రోజుల MPC చర్చల్లో రెపో రేటుతో సహా సామాన్యుడిని ప్రభావితం చేసే కొన్ని కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, MPC నిర్ణయాలను మరికాసేపట్లో ప్రకటిస్తారు.


రెపో రేటు యథాతథంగా కొనసాగుతుందని అంచనా
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీకి ఇది 43వ సమావేశం. RBI, తన రెపో రేటును ఈసారి కూడా యథాతథంగా ఉంచవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల, బ్యాంకులు కూడా తమ రుణ రేట్లను పెంచవు. ఫలితంగా రుణ వడ్డీ రేట్ల పెంపు నుంచి ప్రజలకు ఊరట దక్కుతుంది. గత ఏప్రిల్‌లో జరిగిన ఎంపీసీ సమావేశంలో, వడ్డీ రేటు పెంపును రిజర్వ్‌ బ్యాంక్‌ నిలిపివేసింది, రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించింది. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2022 మే నుంచి రెపో రేటును క్రమంగా పెంచుతూ వచ్చింది. అక్కడి నుంచి 5 దఫాల్లో, 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.5 శాతం పెంచింది. దీనివల్ల, 2022 మే నాటికి 4.5 శాతంగా ఉన్న రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఇదే రేటును ఇప్పుడు కూడా కొనసాగిస్తారని దేశం భావిస్తోంది.


గత MPC సమావేశం తర్వాత వచ్చిన మార్పులేంటి?
2023 ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత దేశీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై RBO MPC దృష్టి పెడుతుంది. దేశంలో ద్రవ్యోల్బణం రేటు, రుతు పవనాలు, చమురు ధరల్లో మార్పులు, విదేశీ పెట్టుబడులు, దేశంలో విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు, భారత ప్రభుత్వ విధానాలు, యూరోప్‌ & అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక వృద్ధి వంటి చాలా అంశాలను గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు MPC సమావేశంలో చర్చిస్తారు. ఆయా అంశాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు ఉంటాయి.


ఇప్పుడు ద్రవ్యోల్బణం రేటు ఎంత?
CPI డేటా ప్రకారం, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ నెలలో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి తగ్గింది. RBI విధించుకున్న గరిష్ట పరిమితి 6 శాతం కంటే దిగువకు చేరింది. 2023 మార్చి నెలలోని 5.7 శాతం నుంచి దిగి వచ్చింది.


GDP వృద్ధి
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గణాంకాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి (GDP) రేటు 7.2 శాతంగా నమోదైంది, సూపర్‌ స్పీడ్‌ ఎకానమీగా నిలిచింది. 2022-23లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తే, ఆ అంచనాలకు మించి వృద్ధి నమోదైంది. ఆర్‌బీఐ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది.


ముడి చమురు ధర
ఏప్రిల్‌లో MPC సమావేశం తర్వాత, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌లో అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్‌కు 85.1 డాలర్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 77 డాలర్లకు పడిపోయింది.


GST వసూళ్లు
2023 ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్‌టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌లో ఇది రూ. 1.87 లక్షల కోట్లు కాగా, మే నెలలో జీఎస్‌టీ రూపంలో రూ. 1.57 లక్షల కోట్లు వసూలయ్యాయి.