Telangana News :   అదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల ముందు  బారులు తీరుతున్నారు.  రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.  మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఆదిలాబాద్‌లోని దుకాణాల ముందు క్యూ కట్టారు. రైతులు విత్తనాల కోసం అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకొని  రైతుల్ని క్రమపద్దతిలో ఉంచి కొనుగోలు చేసేలా చూశారు.  పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. 


ఈ ఘటన తర్వాత పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రారంభమయ్యాయి. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అని కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. హరీష్ రావు కూడా స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని విమర్శించారు. 


 





   
ఈ అంశంపై రాజకీయ దుమారం రేగడంతో ఆదిలాబాద్ పోలీసులు స్పందించారు  ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారన్నది అవాస్తవమని ప్రకటించారు.  రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుం  వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తించారన ిస్పష్టం చేశారు.  ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదు. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదు. పోలీసులు ఏ ఒక్క రైతుపై కూడా లాఠీచార్జ్ చేయడం అనేది జరగలేదని స్పష్టం చేశారు.  ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన, వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదు. అవస్తవమైన వార్తలను,స్క్రోలింగ్ లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.                                   


పోలీసుల స్పందనతో ఆదిలాబాద్‌లో ఎలాంటి ఘర్షణ జరగలేదని తెలుస్తోంది.  పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో.. వారందర్నీ ఓ క్యూ పద్దతిలో దుకాణాల వద్దకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు.  లాఠీచార్జ్ గా ప్రచారం జరగడంతో .. రాజకీయ దుమారం రేగింది.