BRS News :    మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి నిర్వహించాలనుకున్న ఔరంగాబాద్ సభకు స్థలం సమస్య ఏర్పడింది. ప్రస్తుతం నిర్ణయించిన చోట..  సభకు అనుమతి ఇవ్వలేమని అక్కడి పోలీసులు తేల్చి చెప్పారు. అంఖాస్ మైదానంలో సభ నిర్వహించాలని  బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించే ముందు పోలీసుల అనుమతి కోరారు.  -భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
మహారాష్ట్రలోని నాందేడ్‌, కంధార్‌-లోహా సభల సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) మూడో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంద.  రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్నామని.. ఇప్పుడు  మధ్య మహారాష్ట్రపై దృష్టిపెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.  కంధార్‌-లోహా సభ అనంతరం ఔరంగాబాద్‌లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు కేసీఆర్ ను కోరారు.  దీంతో ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 


ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేలకు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఔరంగాబాద్‌ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాడల్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.  శంభాజీనగర్‌లో తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్‌ ప్రచార రథాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది స్కీంల విశిష్టతను ఈ డిజిటల్‌ స్క్రీన్‌ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. ఇటీవల కంధార్‌-లోహా బహిరంగ సభకు ముందు అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఔరంగాబాద్‌లోనూ అమలు చేస్తున్నారు.


మహారాష్ట్రలో పార్టీకి విస్తృత ఆదరణ లభిస్తున్నదని  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.  బీజేపీ, కాంగ్రెస్‌ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగుచెందారని  . సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర ప్రజల్లో ఎనలేని క్రేజ్‌ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  . కేసీఆర్‌లాంటి విజన్‌ ఉన్న నాయకుడు తమకు కావాలని, బీఆర్‌ఎస్‌ పార్టీ విధానాలకు ఆకర్షితులై ఎంతోమంది బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అంటున్నారు. ఔరంగాబాద్‌ సభ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు చేసే దిశానిర్దేశం దేశ రాజకీయాలకు మేలిమలుపుగా ఉంటుందని..  సభకు భారీగా నిర్వహిస్తామని చెబుతున్నారు.