TDP News :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును  వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారని  ఎందుకు కలిశారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. గతంలో ఆయన సునీత వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తుందని కూడా అన్నారు. అయితే వైఎస్ సునీత ఇప్పటి వరకూ రాజకీయ పరంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా చెప్పలేదు. బహిరంగంగా ఏ టీడీపీ నేతనూ కలవలేదు. నిజానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనుమానించిన వ్యక్తుల జాబితాలో ఆదినారాయణరెడ్డి వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఆమెకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నాయని చెప్పేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. 
 
కడప లోక్‌సభకు వైఎస్ సునీత పోటీ చేస్తారని వైఎస్ఆర్‌సీపీ అనుమానం!


కడప లోక్‌సభ పరిలో టీడీపీ తరపున వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత బరిలోకి దిగబోతున్నారని వైఎస్ఆర్‌సీపీ అనుమానిస్తోంది. చంద్రబాబును సునీత కలిశారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం మరింత ఉద్దృతంగా జరుగుతోంది. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష  పడే వరకూ విశ్రమించబోనని సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె ఎక్కడా రాజకీయ అంశాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. వైఎస్ వివేకా బతికి ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడూ రాజకీయ పరమైన చర్చల్లోకి రాలేదు. రాజకీయాలకు దూరంగానే వైద్య వృత్తిలో ఉన్నారు. ఓ వైపు న్యాయం కోసం పోరాటం చేస్తూనే మరో వైపు వైద్యురాలిగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రెగ్యులర్‌గా విధుల్లోకి వెళ్తున్నారు. రాజకీయంగా తెర  ముందుకు వచ్చేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నించలేదు. 
  
వైఎస్ సునీతను టీడీపీ ఆహ్వానిస్తోందా ? 


కడప లోక్‌సభ పరిధిలో వైసీపీని ఓడించాలంటే వైెస్ కుటుంబసభ్యుల వల్లనే సాధ్యమని అందుకే వైఎస్ సునీతను టీడీపీ ఆహ్వానిస్తుందన్న  రాజకీయవర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  ఆమెకు పూర్తి స్థాయిలో టీడీపీ వైపు నుంచి న్యాయపరమైన సహాయాలు అందుతున్నాయని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నారు.  వైఎస్‌ పోరాట తత్వానికి నిజమైన వారసులు ఆమే అవుతుందని టీడీపీ నేతలు ఆమెను అభినందిస్తున్నారు.  ఈ అంశంపై టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు.  సునీత వర్గం కూడా నోరు మెదపడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆమె రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. 


వివేకా  హత్య కేసుకు రాజకీయ కోణం జోడించడానికే ఆరోపణలా ?


అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.  వివేకాహత్య కేసు పూర్తిగా వైఎస్ కుటుంబసభ్యులకు సంబంధించినది. ఇందులో రాజకీయం ఉంటే పూర్తిగా వారి అంతర్గత కుటుంబ రాజకీయమని చెబుతున్నారు.  ఇప్పుడు టీడీపీ అధినేతను.. సునీత కలిసిందని.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుందని ప్రచారం చేయడం ద్వారా..  వివేకా హత్య కేసును పూర్తిగా రాజకీయంగా మార్చవచ్చన్న  ఆలోచనతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. 


సునీత రాజకీయ నేతగా మారితే కడప రాజకీయాల్లో మార్పులు వస్తాయా ?


వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మొదట జగన్ వైసీపీ పెట్టిన ఆ పార్టీలో చేరలేదు. అప్పట్లో జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ ఆ తర్వాత కలిసిపోయారు. వివేకానందరెడ్డి కూడా వైసీపీలో చేరిపోయారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఎమ్మెల్సీగా సీటు ఇచ్చినా వైసీపీకి బలం ఉన్నా ఓడిపోయారు. ఇప్పుడు వివేకా కుమార్తె కూడా అలా విబేధిస్తే కడప రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.