Police Constable Saved Farmer Life: పొలంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న ఓ కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో ఉన్న సదరు రైతును దాదాపు 2 కి.మీల పొలం గట్లపై తన భుజాన మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేర్చి అతని ప్రాణాలు కాపాడారు. శ్రమించి అన్నదాత ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ ను అంతా ప్రశంసిస్తున్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా వీణవంక మండలం భేతిగల్ (Bhethigal) కు చెందిన సురేష్ ఇంట్లో గొడవ పడి పొలం వద్ద బుధవారం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ లు అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ ను జయపాల్ భుజాన వేసుకుని సుమారు 2 కిలో మీటర్ల వరకూ పొలాల గట్ల మీద మోసుకుంటూ వచ్చారు. అనంతరం కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రమించి రైతు ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్, ఇతర సిబ్బందిని ఎస్ఐ వంశీకృష్ణ, స్థానిక నేతలు అభినందించారు.


Also Read: Medaram Jatara Effect: మొన్నటివరకు వావ్, నేడు వామ్మో! మేడారం జాతరలో భక్తులు తెచ్చిన తిప్పలు!