Medaram Sammakka Sarakka Jatara 2024: మేడారం: ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర (Medaram Jatara 2024) ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అట్టహాసంగా జరిగింది. కానీ ఆదివాసిల జాతర మేడారం పరిసరాల్లో కంపు కొడుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరకు కోటికి పైగా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ (Sammakka Sarakka Jatara)ను దర్శించుని మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో మేడారంలో దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతుంది. ఈగలు, పురుగుల, క్రిమి కీటకాలు వ్యాపిస్తున్నాయి. ఓ వైపు దుర్వాసన.. మరోవైపు ఈగల ప్రభావంతో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది.


అపరిశుభ్రత, దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందులు 
నాలుగు రోజులు భక్త జన సందోహంతో మేడారం అటవీ ప్రాంతం పులకించిపోయింది. కానీ జాతర ముగిసిన తరువాత మేడారం చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు దుర్వాసన, దుర్గంధం తో ఇబ్బందులు పడడమేకుండా రోగాల భారిన పడుతారు. ములుగు జిల్లా మేడారం కుగ్రామంలో ఈ నెల 21 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగిన జాతరకు సుమారు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు తరలివచ్చి వనదేవత లైనా సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని వెళ్ళారు. వీరంతా వెళ్తూ వెళ్తూ ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్, కోళ్లు, మేకల వ్యర్ధాలతో పాటు మలమూత్ర విసర్జనలతో నిండిపోయింది. మేడారం మేడారం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా భక్తులు వదిలిన ఫుడ్ వేస్ట్ ప్లాస్టిక్ కోళ్లు మేకల వ్యర్ధాలు కనిపిస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని మేడారం, ఊరటం రెడ్డి గూడెం ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 


మహా జాతరలో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండడానికి జాతరకు 20 రోజుల ముందు నుండే పారిశుధ్య పనులు చేపట్టారు అధికారులు. జాతర ముగిసి సాధారణ మేడారం వచ్చే వరకు 4 వేల మంది పారిశుద్ధ కార్మికులు, వెయ్యి మంది తాత్కాలిక టాయిలెట్స్ క్లీనర్లను కలుపుకొని 5 వేల మంది పారిశుద్ధ కార్మికులు జాతరలో విధులు నిర్వహించారు. అయినా జాతరలో చెత్త, కోళ్లు, మేకల వ్యర్ధాలు పోరుకుపోయాయి. పారిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టులుగా విధులు నిర్వహించినా చెత్త అలాగే ఉందని, జాతర ముగిసి నాలుగు రోజులు అవుతున్న పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. పారిశుధ్య కార్మికుల విధుల గడువు ఈ నెల 29 తో ముగియనున్నాయి. జాతరలో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని చెత్త తొలగింపు ఎప్పుడు ఒడుస్తుందో తెలియదని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు.


జాతరలో వదిలిన వ్యర్థాలతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఊర్లను ఖాళీ చేసి వెళ్తున్నారని, అనేక మంది రోగాల బారిన పడుతున్నారని మేడారం వాసి రాజ్ కుమార్ తెలిపారు. 75 శాతం పారిశుధ్య పనులు పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకయ్య తెలిపారు. అధికారులు మాత్రం మొత్తం మేడారాన్ని క్లీన్ చేశామని, దాదాపు రెగ్యూలర్ వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు.