Jogu Ramanna: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యే అనే తేడా లేకుండా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున పిప్పర్వాడ టోల్ ప్లాజా మీదుగా ఆదిలాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే జోగురామన్న వాహనాన్ని సైతం పోలీసులు తనిఖీలు చేశారు. పొలీసు అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే సహకరించారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీసుల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాహన తనిఖీకి ఎమ్మెల్యే జోగు రామన్న సహకరించారు. పోలీసుల పనితీరుపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. వారికి అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. బంధువుల ఇంటి నుంచి ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ వెళ్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వెంట బీఅర్ఎస్ నాయకులు పాకాల రామచందర్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కారింగుల ప్రణయ్ ఉన్నారు.
రూ.20 కోట్లు సీజ్
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో 258 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 12 ఉదయం వరకు దాదాపు రూ.20.43 కోట్లు సీజ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అన్ని చెక్‌పోస్టుల దగ్గర అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి.. సరైన దృవీకరణ పత్రాలు లేని నగదును స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే స్థాయిలో మద్యం సైతం పట్టుబడుతోంది. అక్టోబర్ 9 నుంచి 12 తేదీ వరకు రూ.86.92 లక్షలు విలువ చేసే, 31,730 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో డబ్బు మద్యం కాకుండా బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి 12 తేదీ వరకు రూ.14.65 కోట్లు విలువగల బంగారం, వెండి, వజ్రాలను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అలాగే మత్తు పదార్థాలు కూడా ఈ తరీక్షల్లో బయటపడుతున్నాయి. రూ.89 లక్షలు విలువ చేసే మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో లాప్టాప్‌లు, వాహనాలు ఇతర వంట సామాగ్రి, స్పోర్ట్స్ థింగ్స్, చీరలు కూడా సీజ్ చేశారు. వాటి విలువ 22 లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నగదు, బంగారం ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై నిఘా ఉంటుంది. నిబంధనల ప్రకారం, రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి ఉంటే వాటిని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎవరైనా తమ వెంట పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తుంటే, అందుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం.