వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైయస్ జగన్ జీవితం ఆధారంగా 'వ్యూహం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ ని నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో రాంగోపాల్ వర్మ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్, 'పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు గాని వేరే వాళ్ళు ప్యాకేజీ స్టార్ అనే టైటిల్ తో విమర్శిస్తూ ఉంటారు. మీరు కూడా ప్యాకేజీ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ మీకు ఇస్తే మీ రియాక్షన్ ఏంటి? అని అడగగా, అందుకు రాంగోపాల్ వర్మ బదులిస్తూ..


"ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా ఫైనల్ గా మీరు నమ్మేది మీరు నమ్ముతారు. నేను ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోలేదు అని చెప్పాను అనుకోండి, తీసుకున్నారని మీరు అనుకుంటారు. అప్పుడు దానికి అర్థమే లేదు. కానీ నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నేను వైసీపీ పార్టీ వాడిని కాదు. ఆయన ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు. ఫాలోవర్ కూడా కాదు. నేనొక నార్మల్ సిటిజన్ మాత్రమే. నా జాబ్ ఫిలిం మేకింగ్. నేను నమ్మిన నిజాన్ని మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్ లో వెనుక ఏం జరిగిందనేది ఈ సినిమా. ఇక్కడ ప్యాకేజీ అనే దానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలియదు" అని అన్నారు.


ఆ తర్వాత మాట్లాడుతూ.. "వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైయస్ మరణం తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు భాగాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని, నేను ఎప్పుడూ చంద్రబాబుని కలవలేదు. జగన్ అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది. చంద్రబాబు అంటే ఒక అభిప్రాయం ఉంది. అయితే నిజం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు. జగన్ మీద నాకున్న అభిప్రాయం ఏంటో ఈ సినిమాలో కనిపిస్తుంది. మిగతా వారిపై నాకు అభిప్రాయం లేదు. నేను వేరే వాళ్ళ మీద తీయమంటే తీయను. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'సర్కార్' సినిమాలు అలా తీసినవే" అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు రాంగోపాల్ వర్మ.


ఇక 'వ్యూహం' ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో జగన్ పై చంద్రబాబు చేసిన కుట్ర అంటూ కొన్ని షాట్స్ చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ పాత్రను కూడా చూపించారు. ప్రస్తుత ఏపీలో హాట్ టాపిక్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ విషయానికి కూడా ఈ ట్రైలర్లో ప్రస్తావించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుంది. శ్రీ రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు అజ్మల్ అమీర్ వైయస్ జగన్ పాత్రలో నటిస్తుండగా, వైయస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ 'వ్యూహం' మూవీ పార్ట్ వన్ నవంబర్ 10న విడుదల కానుండగా, వ్యూహం సీక్వెల్ అయిన 'శపథం' జనవరి 25న రిలీజ్ కానుంది.


Also Read : 'సలార్' vs 'డంకీ' - ప్రభాస్‌తో పోటీలో వెనక్కి తగ్గని షారుఖ్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial