Pocharam Srinivas Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదన్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో ఎక్కడా తెలపకపోవడం బాధాకరమని అన్నారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని వ్యాఖ్యానించారు.


గతంలో స్పందించిన పలువురు ప్రముఖులు
విశాల్: టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడినే.. అరెస్ట్ చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటని సినీ హీరో విశాల్ ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే భయం వేస్తోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు కొంచెం అలోచించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు నిజాయతీ గల నేత అన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని  విశాల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


నిర్మాత సురేష్ బాబు: టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ.. “మా నాన్న రామానాయుడు తెలుగుదేశం పార్టీ మెంబెర్, నేను ఆ పార్టీ కోసం పని చేశాను. కానీ రాజకీయం వేరు, సినిమా వేరు. నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను ఏదైనా సమాధానం చెబుతాను. కానీ నేను ఇక్కడ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని. ఇక్కడ నేను ఏది మాట్లాడినా.. అది సినిమా పరిశ్రమ నుంచి అవుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.


రేవంత్ రెడ్డి: చంద్రబాబు అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. బాబు అరెస్ట్‌ను ఎలా చూస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్ల చూస్తలేమని, ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నామంటూ తెలిపారు. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నామని సమాధానమిచ్చారు. బాబు అరెస్ట్ గురించి స్పందించేందుకు రేవంత్ ఆసక్తి చూపలేదు. దీంతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.


మధుయాస్కీ: చంద్రబాబు అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత మధుమాష్కీ గౌడ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ, జగన్, కేసీఆర్ కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్డీయే కూటమికి మద్దతు తెలపకుండా ఇండియా కూటమి వైపు వస్తారనే భయంతో ఆయనపై మోదీ కక్ష పెంచుకున్నారని విమర్శించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీపై చంద్రబాబు విమర్శలు చేశారని, ఆ విషయాలన్నీ మోదీ గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ఆ కోపంతో జగన్, కేసీఆర్‌లతో కలిసి మోదీ కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. 


బండ్ల గణేష్: బాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తారని సీఎం అవుతారని బండ్ల వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదన్నారు. ఇకపోతే ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలని సూచించారు. పార్కుల ముందు, రోడ్లపై కాదు సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని ధర్నాలు చేయాలని బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎంతోమంది జీవితాలు నిలబెట్టారని, అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఈసారి తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదని చెప్పారు.