బంగారు అమృతంగా పిలవబడే తేనె అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తీసుకుంటారు. పంచదారకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది ఇళ్ళలో తేనె వినియోగిస్తారు. దీని రుచి మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. నేరుగా తేనె పట్టు నుంచి తీసిన తేనెకి దుకాణాల్లో అమ్మే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్వచ్చమైన తేనె తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహార ఉత్పత్తుల్లో తేనె కూడా ఒకటిగా నిలిచింది. పంచదార సిరప్ లో రంగు కలిపి తేనె అంటూ అమ్మేస్తున్నారు. మీరు కొనుగోలు చేసింది స్వచ్చమైన తేనె లేదంటే కల్తీదా అని తెలుసుకునేందుకు ఈ టిప్స్ పాటించి చూడండి.
టిష్యూ పేపర్ పరీక్ష
టిష్యూ పేపర్ తో తేనె స్వచ్చతని పరిశీలించవచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? ఒక టిష్యూ తీసుకుని దాని మీద కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి. కొంత సేపటి తర్వాత తేనె పూర్తిగా అందులో ఇంకిపోతుంది. పేపర్ తేనెని గ్రహిస్తే అది కల్తీది అని అర్థం. కానీ అలా కాకుండా తేనె టిష్యూ మీద అలాగే ఉంటే మాత్రం అది స్వచ్చమైనదని అర్థం.
బ్రెడ్ పరీక్ష
ప్రతి ఇంట్లో బ్రెడ్ తప్పనిసరిగా ఉంటుంది. చాలా మంది బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద తేనె వేసుకుని కూడా తీసుకుంటారు. ఈ బ్రెడ్ తో తేనె ఒరిజనలా నకిలీదా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం బ్రెడ్ ముక్క తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత బ్రెడ్ మీద తేనె ఉందో లేదో చెక్ చేయండి. బ్రెడ్ తేనెని పీల్చుకుని తడిగా ఉంటే అది ఖచ్చితంగా కల్తీది. తేనె పీల్చుకోకుండా ఉంటే మీరు కొనుగోలు చేసిన తేనె నిజమైనది.
అగ్గిపుల్ల పరీక్ష
ఇది చాలా సులభమైన పరీక్ష. దీని కోసం కష్టపడాల్సిన పని కూడా లేదు. ఒక అగ్గిపెట్ట తీసుకుని తేనెలో నానబెట్టాలి. తర్వాత దాన్ని వెలిగించేందుకు ప్రయత్నించండి. అగ్గిపుల్ల కాలిపోతే తేనె కల్తీ కాదు. అదే అగ్గిపెట్టె వెలగడానికి కొంత సమయం తీసుకుంటే మాత్రం అందులో నీరు కలిసిందని అది కల్తీ అని తేలిపోతుంది.
తేనె ప్రయోజనాలు
పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. మరికొందరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రోజు ఒక స్పూను తేనెను ఆరగిస్తారు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శరీరంలోని మంటని తగ్గిస్తాయి. జలుబు, ఫ్లూ నివారణగా అద్భుతంగా పని చేస్తుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనే కలుపుకుని తాగితే హాయిగా నిద్రపడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేనె దంత సమస్యల్ని అడ్డుకుంటుంది. నోరు చెడు వాసన రాకుండా అడ్డుకుంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!