IND vs AUS 1st ODI:
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. రెండు జట్లూ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఒకదానిపై మరోటి ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దాంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (19; 25 బంతుల్లో), కామెరాన్ గ్రీన్ (4; 9 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52; 53 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (41; 60 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ షమి 2 వికెట్లు పడగొట్టాడు. జడ్డూకు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4 పరుగుల వద్దే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4)ను మహ్మద్ షమి పెవిలియన్ పంపించాడు. అతడు వేసిన పుల్లర్ లెంగ్త్ షార్ట్ బాల్‌ను మార్ష్ ఆఫ్‌స్టంప్ మీద డిఫెండ్ చేయబోయి శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడారు. రెండో వికెట్‌కు 106 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చక్కని బంతుల్ని డిఫెండ్ చేసిన డేవిడ్ భాయ్ అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
అత్యంత ప్రమాదకరంగా మారిన వార్నర్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని మోకాళ్లపై కూర్చొని స్లాగ్‌స్వీప్ చేయాలని వార్నర్ ప్రయత్నించాడు. బంతి కాస్త బౌన్స్ అవ్వడంతో బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేవడంతో గిల్ చక్కగా అందుకున్నాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 98. మరోవైపు భారత పిచ్‌పై చక్కని అవగాహన కలిగిన స్టీవ్ స్మిత్ నెమ్మదిగా ఆడాడు. ఒక్కో బంతిని ఆడుతూ పోయాడు. ఎక్కడా అనవసర షాట్లు ఆడేందుకు ప్రయత్నించలేదు. టీమ్‌ఇండియాను ఇబ్బంది పెడుతున్న అతడిని మహ్మద్ షమి ఔట్ చేశాడు. అతడు వేసిన బంతి బ్యాటు, ప్యాడ్లకు మధ్యలోంచి వెళ్లి లెగ్‌వికెట్ ఎగరగొట్టింది. దాంతో కంగారూలు 112 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకున్నారు. ప్రస్తుతం గ్రీన్, లబుషేన్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోస్ ఇంగ్లిష్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ షార్ట్, ప్యాట్ కమిన్స్, సేన్ అబాట్, ఆడమ్ జంపా
పిచ్ రిపోర్ట్: మొహలి హై స్కోరింగ్ గ్రౌండ్. ఈ సారీ అలాగే ఉంటుంది. బౌండరీలు కొట్టడంతో పాటు బ్యాటర్లు పరుగులు తీయాలి. టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపుతుంది. బౌన్స్ బాగుంటుంది. మంచి లయ అందుకున్న బ్యాటర్లు బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తారు.
కేఎల్ రాహుల్, భారత కెప్టెన్ : మేం మొదట బౌలింగ్ చేస్తాం. ఈ మైదానం ఛేదనకు అనుకూలంగా ఉంటుంది. అందుకే బౌలింగ్ చేస్తాం. మేం మరికొన్ని విభాగాల్లో ప్రయోగాలు చేయాల్సి ఉంది. మరింత మెరుగుయ్యేందుకు మేమిలా చేస్తూనే ఉంటాం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో మేమిప్పుడు తలపడుతున్నాం. ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలే. వారు గట్టి పోటీనిస్తారు. అందుకే వారిని ఎదుర్కోవడాన్ని మేం ఆస్వాదిస్తాం.