Alzheimer's: ఆస్ట్రేలియన్ పరిశోధకులు, భారతీయ సంతతికి చెందిన వారితో కలిసి సరికొత్త రక్తపరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి రావడానికి 20 సంవత్సరాల ముందే దీన్ని గుర్తించవచ్చు. నాన్ ఇన్వాసివ్ రక్తపరీక్ష ద్వారా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ANU) నుంచి భౌతిక శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ఉపయోగించేందుకు కృత్రిమ మేధస్సు (AI)తో కలిసి రక్తంలోని ప్రోటీన్ ని పరిశీలిస్తారు. ఇది న్యూరోడెజెనరేషన్ సంకేతాలు శోధించేందుకు ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రారంభాన్ని ఇది కనిపెట్టి చికిత్స తీసుకునేందుకు సహాయపడుతుంది.
భౌతిక శాస్త్రవేత్తలు నానోపోర్స్ కలిగిన అతి సన్నని సిలికాన్ చిప్ ని అభివృద్ధి చేశారు. ఇది అధునాతన AI అల్గోరిథం సహాయంతో ప్రోటీన్‌లను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తుంది. సిలికాన్ చిప్ మీద కొద్ది మొత్తంలో రక్తం ఉంచి మొబైల్ ఫోన్ పరిమాణంలో ఉన్న పోర్టబుల్ పరికరంలో దాన్ని ఉంచుతారు. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రారంభానికి సంబంధించిన సంకేతాలని గుర్తించడంలో ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ కి చికిత్స లేనప్పటికీ 20 ఏళ్ల లోపు ఎవరైనా తమకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అల్జీమర్స్ ప్రమాద స్థాయిని ముందుగానే కనుగొనగలిగితే జీవనశైలిలో మార్పులు చేసుకుని వ్యాధి పురోగతిని తగ్గించుకోవచ్చు.
ఈ అల్గోరిథం పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్‌తో సహా ఒకే సమయంలో బహుళ నాడీ సంబంధిత పరిస్థితులను పరీక్షించడానికి ఉపయోగపడుతుందని పరిశోధన బృందం తెలిపింది. అల్జీమర్స్ వ్యాధి మెదడుని తీవ్రంగా దెబ్బతీస్తుంది. సమర్థవంతమైన చికిత్స కోసం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ముఖ్యం. రక్తంలో పది వేల కంటే ఎక్కువ విభిన్న జీవఅణువులు కలిగి ఉండే సంక్లిష్ట ద్రవం. అధునాతన వడపోత పద్ధతులు ఉపయోగించి ఇంటెలిజెంట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అంతుచిక్కని ప్రోటీన్ లు కూడా గుర్తించగలమని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!
అల్జీమర్స్ కి వ్యాక్సిన్
ఇప్పటి వరకు అల్జీమర్స్ కి సంబంధించి ఎటువంటి మందులు లేవు. ప్రస్తుతం ఈ వార్త కాస్త సంతోషాన్ని కలిగించేది. ఎందుకంటే అల్జీమర్స్ రావడానికి 20 ఏళ్లు ముందుగానే గుర్తించడం వల్ల భవిష్యత్ లో వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. మెదడులోని ప్లేక్స్ అని పిలిచే ఫలకాలలోని కణాలు అతిగా కుచించుకుపోవడం, కొన్ని మెదడు కణాలు మరణించడం వల్ల మతిమరుపు వస్తుంది. మతిమరుపు వ్యాధిని నయం చేసేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అలాగే ఓ కొత్త ఔషధాన్ని కూడా కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్, ఔషధం మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ కచ్చితంగా అల్జీమర్స్ వ్యాధిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.