Telangana Congress: బీఆర్ఎస్ నుంచి ఇటీవల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేబినెట్‌ హోదా కూడా కల్పించింది. ప్రభుత్వ సలహదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డిని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఫెడరేషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు అమిత్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారు.


అయితే, ఈ రెండు నామినేటెడ్ పోస్టులు రెడ్డిలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కార్యకర్తలకు నియామకాలు లేవు, అదికూడా ఇటీవల కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎదురుచూస్తున్న బీసీ, బహుజన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా వారికే ఇవ్వడం ఏంటని చర్చ జరుగుతోంది.