Youth commits suicide after falling in debt | నల్గొండ: బెట్టింగ్ లాంటి వ్యవసనాలకు బానిసైతే కేవలం ఆర్థిక సమస్యలే కాదు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. కొన్ని సందర్భాలలో అప్పులు భారమై విడాకుల వరకు వెళ్తోంది. కొందరు వ్యక్తులు బెట్టింగ్ కోసం చేసిన అప్పుల బాధ భరించలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్య ఒక్కటే మార్గమని బలవన్మరణానికి పాల్పడి, తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మిస్ యూ అమ్మా, నాన్న అంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
నల్గొండ - నెహ్రూ గంజ్ ప్రాంతానికి చెందిన తడకమల్ల సోమయ్య కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారులు సంతోష్, తడకమళ్ల సాయి(28) తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉండేవారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు సాయి బెట్టింగ్ కు ఆకర్షితుడయ్యాడు. ఆన్ లైన్‌లో బెట్టింగ్స్ పెట్టి, డబ్బులు కోల్పోయాడు. మరోవైపు అప్పుల భారం దాదాపు కోటి రూపాయలకు చేరినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి ఒత్తిడి తెస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం దొరకక, ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకోవడమే తనకు మార్గమని భావించాడు.
ఫ్యామిలీ ఫిర్యాదులో మిస్సింగ్ కేసు నమోదు
ఆగస్టు 14న బయటకు వెళ్లిన సాయికుమార్ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా, బంధువులను ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో అతడి సోదరుడు సంతోష్ ఆగస్టు 17న సాయి మిస్సింగ్ పై నల్గొండలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హాలియాలో 14 మైలు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో సాగర్ ఎడమ కాలువలో సాయి మృతదేహం కనిపించింది. బైకు, సెల్‌ఫోన్ అక్కడే వదిలేసిన సాయి, ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో
‘సారీ, మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. నాకు బతకాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. మిస్ యూ అమ్మా, మిస్ యూ నాన్న. మిస్ యూ అన్నావదిన అంటూ’ సూసైడ్ చేసుకోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పెన్‌పహాడ్ పోలీసులు గుర్తించారు. కాలువలో మృతదేహం కొట్టుకురావడంతో ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీసి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సాయి తల్లిదండ్రులు కుమారుడి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తమకు కడుపు కోత మిగిల్చి వెళ్లిపోయావంటూ ఆవేదన వ్యక్తం చేశారు.