Truck driver Rajesh Rawani income is ten lakhs per month :  డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి ?.  బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఐటీ ఉద్యోగం తెచ్చుకుంటే.. నెలకు రెండు, మూడు లక్షలు వస్తాయి. ఇంకా పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఐదు లక్షల వరకూ రావొచ్చు. జీవితంలో దశాబ్దాల పాటు కష్టపడి.. మేనెజ్‌మెంట్ స్థాయికి వెళ్తే.. అంటే రిటైర్మెంట్ అయ్యే దశలో నెలకు పది లక్షలు అంత కంటే ఎక్కువ రావొచ్చు. కానీ.. పెద్దగా ఏమీ చదువుకోకుండానే కోటీశ్వరులు అయ్యే వారుంటారు. అలాంటి వారిలో ఎక్కువ మంది వ్యాపారాలు చేస్తారు. కానీ ట్రక్ డ్రైవర్ గా ఉంటూ నెలకు పది లక్షలు సంపాదించడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. అలాంటి ఘనతను సాధించాడు... రాజేష్ రవాని అనే ట్రక్ డ్రైవర్. 


జార్ఖండ్‌లోని జామ్‌తార అనే ఊరికి చెందిన రాజేష్ రవానికి చదువు అబ్బలేదు . మొదట్లో లారీ క్లీనర్ గా వెళ్లారు. తర్వాత డ్రైవర్ అయ్యారు. ఆయన దేశం మొత్తం తన ట్రక్కుతో తిరుగుతూనే ఉంటారు. కశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్ని సార్లు తిరిగారో లెక్కలేదు. ఇలా తిరిగితే మాత్రం.. నెలకు పది లక్షలు ఇచ్చేస్తారా అనుకోవాల్సిన పని లేదు. ఆయన ట్రక్ డ్రైవింగ్‌తో పాటు.. దే్శాన్ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు. దాన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు. అంటే ట్రక్ డ్రైవర్ గా తనకు ఎదురయ్యే అనుభవాల్ని  సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వీటికి ఎంత ఆదరణ ఉందంటే.. ఏ వీడియో అప్ లోడ్ చేసినా మిలియన్స్ లోనే వ్యూస్ వస్తూంటాయి.  



రాజేష్ రవాని మొదట్లో హాబీగా యూట్యూబ్ వీడియోలు అప్ లోడ్ చేసేవారు. దేశంలో విభిన్న ప్రాంతాలను పరిచయం చేస్తూండటంతో పాటు ట్రక్ డ్రైవర్ లైఫ్ ను వివరిస్తూండటం.. అవి ఆసక్తికరంగా ఉండటంతో సబ్ స్క్రైబర్లు అంతకంతకూ పెరిగారు. తర్వాత.. ఇతర సోషల్ మీడియాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా వీడియోలు తీసుకుంటూ.. అప్ లోడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా నెటిజన్లకు చిరపరిచితమైన ట్రక్ డ్రైవర్. ఆయన వీడియోల కోసం.. నెటిజన్లు ఎదురు చూస్తూంటారు. 


నెలకతు పది లక్షలు వచ్చినా.. తన దిన చర్యలో ఎలాంటి మార్పులు రానియలేదు రాజేష్ రవాని. తన కుటుంబానికి  కావాల్సిన అన్ని సౌకర్యాలను ఊళ్లో సమకూర్చాడు. నెలకు పది లక్షలు వచ్చినా ట్రక్ డ్రైవింగ్ మాత్రం వదిలి పెట్టరు. ఎందుకంటే...తనకు ఆదాయం ఇస్తోంది అదేకదా అంటారు.