PM Modi Comments in Jaitial Meeting: పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో (Jagitial) జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరిగిందన్న మోదీ.. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. 'దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితేనే తెలంగాణలోనూ అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.' అని మోదీ పేర్కొన్నారు.


'బీఆర్ఎస్ దోపిడీ.. కాంగ్రెస్ ఏటీఎం'


ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందని మోదీ అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారిని తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 'తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైల్స్ పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. లిక్కర్ స్కాంలోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. ఢిల్లీలో కుటుంబ పార్టీల పెద్దలకు తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తున్నాయి. దేశంలో ఏ దోపిడీ పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీల జాబితాలో బీఆర్ఎస్ చేరింది.' అంటూ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు.


'400లకు పైగా సీట్లు ఖాయం'


దేశంలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందని.. గడిచిన 3 రోజుల్లో రెండుసార్లు తెలంగాణకు వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. 'రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతున్నాయి. నేను భారతమాత పూజారిని. తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయబోతున్నారు. ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుంది. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం.' అని ధీమా వ్యక్తం చేశారు.


Also Read: Danam Nagendar: దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ - స్పీకర్ కు సమర్పించిన బీఆర్ఎస్ నేతలు