BRS Mlc Kavitha Petition in Supreme Court: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. అటు, కవితను ఈడీ రెండో రోజు విచారించనుంది. ఆమెతో పాటు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.


తొలిరోజు ప్రశ్నల వర్షం


కాగా, తొలి రోజు విచారణలో కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పలు అంశాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. కవిత కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారం ఆమె ముందుంచి పలు చూపించి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ మొత్తాన్ని అధికారులు వీడియో తీశారు. విచారణ అనంతరం నిబంధనల మేరకు ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్ తో పాటు సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయం వరకూ వచ్చినా వారు బయటే ఉండిపోయారు. 


ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ నెల 15న (శుక్రవారం) హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాదులు కవితను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని వాదించారు. ఇదే క్రమంలో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కవితను 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకూ ఈడీ విచారణకు అనుమతించింది. అదే రోజు మధ్యాహ్నం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను ఆదేశించారు. అయితే, ఆమెను ప్రతీ రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయస్థానం అనుమతించింది. అలాగే, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు సైతం వెసులుబాటు కల్పించింది. 


Also Read: Singer Mangli: ప్రముఖ గాయని మంగ్లీ కారును ఢీకొన్న డీసీఎం - మంగ్లీకి తప్పిన ప్రమాదం, ముగ్గురికి స్వల్ప గాయాలు