Kirti Azad Slams Jay Shah On Virat Kohlis: భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ కీర్తి ఆజాద్‌(Kirti Azad)  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలుపై క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్‌(T20 World cup) కోసం ప్రకటించే భారత జట్టులో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shash)కు కెప్టెన్‌ రోహిత్‌(Rohit Sharma) తేల్చిచెప్పినట్లు కీర్తి ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ 20 ప్రపంచకప్‌ కోసం  ప్రకటించే భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయొద్దని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పినట్లు వార్తలు రాగా.. ఆ మాట చెప్పడానికి షా ఎవరని ఆజాద్‌ ప్రశ్నించాడు. 


జై షా ఎవరు..?
పొట్టి ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టులో కోహ్లి ఉండకుండా ఇతర సెలక్టర్లను ఒప్పించే బాధ్యతను ప్రధాన సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు జై షా ఎందుకు అప్పగిస్తాడని కీర్తి అజాద్‌ ప్రశ్నించాడు. జై షా సెలక్టర్ కాదని.. అతనికి సెలక్షన్‌కు అసలు సంబంధం ఏంటని నిలదీశాడు. టీ 20 ప్రపంచకప్‌ జట్టులో కోహ్లీ ఉండకూడదనే విషయంలో మిగిలిన సెలక్టర్లను ఒప్పించేందుకు ఈ నెల 15 వరకు అగార్కర్‌కు సమయమిచ్చారని.. కానీ ఇదే విషయమై రోహిత్‌తోనూ జై షా మాట్లాడాడని కీర్తి ఆజాద్‌ వెల్లడించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లి కావాల్సిందేనని రోహిత్‌ చెప్పాడని... టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడతాడని స్పష్టం చేశాడు. దీనిపై జట్టు ఎంపికకు ముందే అధికారిక సమాచారం వస్తుందని... జట్టు ఎంపిక ప్రక్రియలో మూర్ఖులు తలదూర్చకూడదని కూడా ఆజాద్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. కోహ్లి జట్టులోకి రాకుండా జై షా అడ్డుకుంటున్నాడనే అర్థం వచ్చేలా కీర్తి ఆజాద్‌ పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌ ముగియగానే జూన్‌ 2న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. పొట్టి కప్పులో తలపడే భారత్‌కు రోహితే కెప్టెన్‌. కానీ ఈ టోర్నీలో కోహ్లి ఆడతాడా? లేదా? అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


గతంలోనూ..
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో కింగ్‌ కోహ్లి(Kohli), రోహిత్‌శర్మ(Rohit Sharma) కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు.  అవకాశం ఉన్నా రంజీ ట్రోఫీలో వీరు బరిలో దిగకపోవడంపై సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను బీసీసీఐ తప్పించిన నేపథ్యంలో కీర్తి ఆజాద్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. కిషన్‌, శ్రేయస్‌ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే అని మరి రోహిత్‌, కోహ్లీ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌పైనే దృష్టి పెడుతున్నారని.... రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లిలు సైతం ఖాళీ దొరికితే దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని సూచించాడు. కిషన్‌, శ్రేయస్‌లపై మాత్రమే కొరడా ఝుళిపించడం తప్పని.. నిబంధనలు మీరితే ఎవరిపైనైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలి కదా అని ఆజాద్‌ నిలదీశాడు.