ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రధానిని ఆహ్వానించేందుకు వచ్చిన బండి సంజయ్.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇదేనా మీ సంస్కారం? 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఞానం ఏమైపోయింది అని సూటిగా ప్రశ్నించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు.  సీఎం కేసీఆర్ కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా అని బండి సంజయ్ విమర్శించారు. 


భయపడి ముఖం చాటేశారు..!


సీఎం కేసీఆర్ కుంటిసాకులు చెబుతూ ప్రధాని మోదీ పర్యటన నుంచి తప్పుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.  'మీ భాష చూసి దేశమంతా అసహ్యించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నారా?. మీ లాంటి వారు రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సరికాదు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానిస్తారు. మీ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. ప్రధానిని అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించినట్లే. మీ భాష, మీ సంస్కారం చూసి తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడుతోంది. అస్వస్థత కారణంగా రాలేదని కుంటి సాకులు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని' బండి సంజయ్ అన్నారు. మోదీ పేరు చెబితేనే కేసీఆర్ కు జ్వరం వచ్చినట్లుందన్నారు.  భయపడి ముఖం చాటేసినట్లున్నారని తీవ్రంగా విమర్శించారు. 


సీఎం కేసీఆర్ కు జ్వరం 


ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. నేడు కేసీఆర్‌ స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి. నిజానికి ప్రధాని పర్యటనకు స్వాగతం పలికేందుకు తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీఎం స్వయంగా ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు తిరిగి వెళ్లేవరకూ కేసీఆర్ పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు చివరి నిమిషంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ఆయన స్వల్ప అస్వస్థతతో ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


Also Read:  భారతీయ మూలల నుంచి నేర్చుకుంటూ భవిష్యత్‌వైపు దూసుకెళ్దామన్న మోదీ