హైదరాబాద్‌లో ఉన్న ఇక్రిసాట్ 50వ వార్షికోత్సవాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం స్మారక స్టాంపును కూడా విడుదల చేశారు.
మొక్కల సంరక్షణపై వాతావరణ మార్పు పరిశోధన సౌకర్యం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు.
ఇక్రిసాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి... 2070 నాటికి నెట్‌జీరోను లక్ష్యంగా ఎంచుకున్నట్టు చెప్పారు. పర్యావరణానికి అనుగుణంగా ప్రజల జీవితాలను జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యతకు గుర్తించామన్నారు మోదీ. ప్రోప్లానెట్ పీపుల్ ఉద్యానికి పిలుపునిచ్చామని.. వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి ఇవి తప్పనిసరి అన్నారాయన.
వ్యవసాయాన్ని సులభతరం చేయడం, నిలకడగా మంచి దిగుబడులు సాధించడంలో ఇక్రిసాట్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ. ఈ విషయంలో చాలా దేశాలకు ఇక్రిసాట్ సహాయం చేసిందని గుర్తు చేశారు. భారత దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇక్రిసాట్ తన అనుభవాన్ని ఉపయోగిస్తుందని ఆశించారు మోదీ.
వాతావరణ మార్పుల నుంచి దేశ రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. మూలాలకు తరలి వెళ్లి భవిష్యత్‌వైపు నడవాలని సూచించారు. 80శాతనికిపైగా ఉన్న చిన్న రైతులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. అందుకే మొన్నటి బడ్జెట్‌లో నేచురల్, డిజిటల్ అగ్రికల్చర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు మోదీ.
రాబోయే కొన్నేళ్లలో పామాయిల్ రంగ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మోదీ తెలిపారు. పామాయిల్ విస్తీర్ణాన్ని 6.5 లక్షల హెక్టార్లకు పెంచాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆహార భద్రతతోపాటు పోషకాహార భద్రతపై దృష్టి పెట్టినట్టు ప్రకటించారు. గత ఏడేళ్లలో అనేక బయో-ఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేసినట్టు గుర్తు చేశారు మోదీ.