నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఫేమస్. తెలంగాణలో అత్యధికంగా పసుపు పంటను జిల్లాలో పండిస్తారు. పసుపు పంట చేతికి రావాలంటే 9 నెలల సమయం తీసుకుంటుంది. రైతులు ఎంతో శ్రమకోర్చి పంట పండిస్తారు. వ్యయప్రయాసలతో కూడిన పంట పసుపు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ మార్కట్ కు పసుపు భారీగా వస్తోంది. అయితే మద్దతు ధర రావటం లేదని పుసుపు రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మార్కెట్ కు గోల రకం, మండ రకం పసుపు తీసుకొస్తున్నారు రైతులు. గోల రకం అత్యధిక ధర 8,138 క్వింటాకు పలుకుతుండగా.... అత్యల్పంగా 5 వేలు పలుకుతోంది. మండ రకంలో అత్యధికంగా క్వింటాకు రూ.7,170 అత్యల్పంగా రూ.4500 ధర పలుకుతోంది. అదే మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ పసుపు ధర నిజామాబాద్ మార్కెట్ కంటే రూ. 3 వేలు క్వింటాకు ఎక్కువగా పలుకుతోంది. కొంత మంది రైతులు పసుపును సాంగ్లీ మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే పసుపు దిగుబడి తక్కువగా ఉన్న రైతులు గత్యంతరం లేక నిజామాబాద్ మార్కెట్ లోని గిట్టుబాటు కాకున్న అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మార్కెట్ కు పోటెత్తున్న పసుపు


గత రెండ్రోజుల నుంచి నిజామాబాద్ మార్కెట్ కు పసుపు భారీగా వస్తోంది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల నుంచి పసుపును రైతులు మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే వర్షాలు, దుంపకుళ్ల తెగుళ్లలతో ఈసారి పసుపు దిగుబడి భారీగా తగ్గిందంటున్నారు రైతులు. ఆకాల వర్షాలకు తోడు దుంపకుళ్ల తెగుల్లు పసుపు రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పసుపునకు మంచి డిమాండ్ ఉంది. ఔషధాల్లో పసుపును తప్పనిసరిగా వాడుతారు కాబట్టి పసుపునకు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే మార్కెట్ లో మాత్రం రైతులను నిలువునా దగాకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో కల్లిబొల్లిమాటలు చెప్పి వారు నిర్ణయించిన ధరకే పసుపు అమ్మాల్సివస్తోందంటున్నారు పసుపు రైతులు. 


పెట్టుబడి కూడా రాని పరిస్థితి


పసుపు రైతుకు మార్కెట్ లో ధర చూస్తే కనీసం పెట్టుబడి కూడా రావట్లేదని అంటున్నారు. ఎకరాకి రూ. లక్షా 50 వేలు రైతు ఖర్చు చేస్తున్నారు. గతేడాది ఎకరాకి దిగుబడి 20 నుంచి 25 క్వింటాళ్లు వచ్చింది. ఈసారి అకాల వర్షాలు, దుంపతెగుళ్లలతో ఎకరాకు 5 నుంచి 18 క్వింటాళ్ల దిగబడి వస్తోంది. అంటే దిగుబడి భారీగా తగ్గింది. క్వింటా ధర రూ. 9 వేల నుంచి రూ. 8 వేలకు పడిపోయింది. ప్రస్తుతం క్వింటాకు రూ. 7 వేల చిల్లర నడుస్తోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు పసుపు రైతులు. కనీసం క్వింటాకు 14 నుంచి 16 వేల రూపాయల వరకు ధర పలకాలి. అయితేనే రైతు పండించిన కష్టానికి ఫలితం ఉంటుందంటున్నారు. ఈసారి పసుపు 35 వేల నుంచి 40 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఆశించిన దిగుబడి రాక ఓ వైపు రైతు దిగులు చెందుతుంటే మరోవైపు మార్కెట్ లో గిట్టుబాటు ధర రాక పసుపు రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. పసుపునకు భారీగా డిమాండ్ ఉన్నా... రైతుల విషయానికి వస్తే ధర విషయంలో సరైన న్యాయం జరగటం లేదని పసుపు రైతు కలత చెందుతున్నారు. వ్యయ ప్రయాసల కోర్చి పసుపు పండిస్తే కనీస మద్దతు ధర రావట్లేదంటున్నారు. ధర ఇలాగే ఉంటే ఇక ఈ సీజన్ లో పసుపు పంటను వేయబోమంటున్నారు రైతులు. ఇకనైనా ప్రభుత్వాలు మద్దతు ధరపై స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు పసుపు రైతులు.