PG Student Injured While Fan Fell In Hostel: హాస్టల్ గదిలో ఫ్యాన్ పడి ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలైన ఘటన హన్మకొండలోని కాకతీయ వర్శిటీలోని (Kakateeya University) హాస్టల్‌లో చోటు చేసుకుంది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లూనావత్ సంధ్య కాకతీయ వర్శిటీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ గది నెం.19లో ఉంటూ చదువుకుంటోంది. శుక్రవారం రాత్రి భోజనం తర్వాత హాస్టల్ గదికి వచ్చిన ఆమె మంచంపై ఉన్న తన వస్తువులు సర్దుకుంటుండగా.. సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి మీద పడింది. దీంతో ఆమె నుదుటికి తీవ్ర గాయమైంది. గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్ సూపర్ వైజర్ సాయంతో విద్యార్థినిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. విషయం తెలుసుకున్న కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


విద్యార్థినుల ఆందోళన


మరోవైపు, ఈ ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్ శిథిలావస్థకు చేరిందని అయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ధర్నా చేశారు. మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. పాత భవనంలో ఎప్పుడో బిగించిన ఫ్యాన్లు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వాష్ రూమ్స్ కూడా సరిగ్గా లేవని.. కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని రిజిస్ట్రార్‌ను నిలదీశారు. రెండు మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని వర్శిటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.


Also Read: Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి