Severe Fire Accident In Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో (Shadnagar) శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బూర్గుల గ్రామ శివారులోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్ కుప్పకూలింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 30 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో 150 మందికి పైగా కార్మికులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: Hyderabad News: పోలీసులకు మస్కా కొట్టిన మందుబాబు బ్రీత్ అనలైజర్ తో పరార్