Drunk Man Escape With Breathalyzer : మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు చెక్ చెప్పేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రీత్ అనలైజర్ లు పట్టుకొని మందు బాబులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటారు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మందుబాబులు తమ అలవాటును మాత్రం మానుకోవడం లేదు. మద్యం తాగే వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మందుబాబులు ఆగనప్పటికీ.. పోలీసులు తమ పనిని కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తూ మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే క్రమంలో పోలీసులు చిత్ర విచిత్ర అనుభవాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాదులోని బోయిన్పల్లిలో అటువంటి ఘటనే పోలీసులకు అనుభవం అయింది. గురువారం రాత్రి హైదరాబాదులోని అనేక ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ మందు బాబు హుషారుతనం చూపించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో భాగంగా మందుబాబు నోట్లో బ్రీత్ అనలైజర్ ను పోలీసులు పెట్టారు. అయితే, పోలీసులు మిషన్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే మందుబాబు పరారయ్యాడు. ఈ క్రమంలోనే పోలీసులు నోట్లో పెట్టిన బ్రీత్ అనలైజర్ మిషన్ ను కూడా ఆ మందుబాబు పట్టుకుని పారిపోయాడు. ఒక్కసారి షాక్ కు గురైన పోలీసులు మందుబాబు వెనుక పరుగులు పెట్టారు. అయినప్పటికీ ఎక్కడ దొరకకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు.. స్థానిక బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసిన పోలీసులకే మస్కా కొట్టి పారిపోయిన మందు బాబు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మందు బాబుకు పోలీసులు జల్ల కొడతారని భావించిన సమయంలో.. పోలీసులకే మందుబాబు తన కిక్కుతో హుషారు చూపించాడు.


మందుబాబులతో పోలీసులకు తప్పని చిక్కులు.. 


డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించే పోలీసులకు అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఈ టెస్ట్ నిర్వహించే క్రమంలో మందు బాబులతో పోలీసులు గొడవ పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోంది. ఉన్నత వర్గాలకు చెందిన ఎంతోమంది పోలీసులపై దురుసు ప్రవర్తన కూడా చేస్తుంటారు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు కొన్నిసార్లు ఉన్నతాధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు వస్తుంటాయి. ఏది ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సందర్భంగా పోలీసులకు ఎదురయ్యే అనుభవాలు చిత్ర, విచిత్రంగా కనిపిస్తుంటాయని పోలీసులు చెబుతున్నారు. కొన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు అవసరమైన బ్రీత్ అనలైజర్ ను నోట్లో పెట్టుకునేందుకు కూడా మందుబాబులు ఓపికతో ఉండరని, అటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఒక్కోసారి ఇటువంటి అనుభవాలు తప్పడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.