Telangana News : ఉదయం 11.30. తెలంగాణ మొత్తం ఒక్క సారిగా లక్షలాది గొంతులు నుంచి జాతీయ గీతం ఆలపించాయి. ఇళ్లల్లో ఉన్నా.. ఆఫీసుల్లో ఉన్నా.. డ్రైవింగ్‌లో ఉన్నా.. ట్రాఫిక్‌లో ఉన్నా..అందరూ ఒక్క నిమిషం పాటు స్టిఫ్ అలర్ట్ అయ్యారు. ఎక్కడి వారక్కడ జాతీయ గీతాన్ని ఆలపించారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని అన్నీ ప్రధాన కూడళ్లు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు,అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు.
సామూహికంగా జాతీయ గీతాలాపన చేయడమే కాదు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పలువురు ప్రముఖులు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఆగస్ట్ 8న ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 22 వరకు వజ్రమహోత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఇలా ఓ రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ఒకే సారి జాతీయ గీతాలాపన చేయడం రికార్డుగా భావిస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు అరుదుగా ఉన్నాయని చెబుతున్నారు.