BJP Politics: ఒకరిది దూకుడు, మరొకరి అనుభవం. ఒకరు నిప్పులాంటి మాటల తూటాలు పేలుస్తుంటే మరొకరు పదునైన వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ కి అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. నేరుగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. మరి వీరిద్దరూ చేసే వ్యూహాలు ఫలించబోతున్నాయో లేదో చూద్దాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు బీజేపీలో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బండి సంజయ్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. మరో వైపు అనూహ్యంగా పార్టీలోకి వచ్చి కీలకమైన పదవిలో చేరారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన విజయంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులను కదిలించే పనిలో పడ్డారు. ఇద్దరు నేతలు ప్రధానంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ కింది స్థాయి క్యాడర్ తో నేరుగా సంబంధాలు నెరుపుతున్నారు. ఇక ఈటల రాజేందర్ వరుసగా రహస్య మీటింగులు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే వరుస ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి తీసుకోకుండా వ్యూహాలు పన్నుతున్నారు ఆ పార్టీ అధినేత బండి సంజయ్.
దూకుడుగా ఈటల వ్యూహాలు..
దిల్లీ అధిష్ఠానం ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరిద్దరిలో ఈటల రాజేందర్ కు కీలకమైన చేరికల కమిటీ ఛైర్మన్ గా ఎంపిక చేసింది బీజేపీ అగ్ర నాయకత్వం. స్వయంగా ఉద్యమ కారుడు అయి ఉండడం, మొదటి నుండి కూడా మాస్ లీడర్ గా ఉన్న గుర్తింపు.. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి లో ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ లో తనకున్న పరిచయాలు, టీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి బాగా తెలిసి ఉండడంతో పార్టీలోకి కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించే విషయంపై ఈటల రాజేందర్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. దీంతో దూకుడు మీదున్న ఈటల.. రానున్న రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉంటాయంటూ పలు మార్లు మీడియా ముందే ప్రస్తావించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడంతో పాటు.. ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉండి తరువాత కేసీఆర్ కుటుంబానికి దూరమైన నికార్సయిన తెలంగాణ వాదులను చేర్చుకునే ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఫలిస్తున్న వ్యూహాలు..
ఒకప్పుడు టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించి తర్వాత కనుమరుగైన నేతలకు కాషాయ కండువా కప్పే పనిని వేగవంతం చేశారు ఈటల. ఆలా టీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసే ప్రయత్నంలో ఉన్నారు. అంతే కాదు సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా తనపై పోటీకి సై అంటూ ఇప్పటికే సవాల్ విసిరారు. ఈ ప్రకటన నిజానికి సంచలనంగా మారింది. ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ పైగా సీఎంని ఎన్నికల్లో చాలెంజ్ చేయడం అంటే ఒక రకంగా ఆ పార్టీ కింది స్థాయి నాయకుల్లో కార్యకర్తల్లో ఒక రకంగా భయాన్ని పెంపొందించారు. ఈటల వ్యూహం సరిగ్గా ఫలించింది. రాజేందర్ విసిరిన సవాల్ కి ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి అధికార టీఆర్ఎస్ లో నెలకొంది.
బుల్లెట్టు వేగంతో బండి..
అటు బండి సంజయ్ తన దూకుడును కొనసాగిస్తూ అనేక అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నేతలందరి అవినీతి బయట పెడతానని సీఎంని, సీఎం కుటుంబాన్ని జైలుకు పంపించడం గ్యారెంటీ అంటూ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు నేతలు రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవులు పొందుతారని వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.