రావోయి రాష్ట్రానికి ఫుల్లుగా డ్రగ్స్ ఉన్నాయి, ప్రభుత్వ లిక్కర్ ఉన్నది అనేలా వైసీపీ పాలన కొనసాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. SC, ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కోలేక కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జాతీయ జెండాను పవన్ ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తున్న తమపై కులం రంగు పులుముతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను పదవులు కోరుకున్నానా..
పార్టీని నడిపేందుకు వైఎస్సార్‌సీపీ నేతలకే అర్హత ఉందా, మాకు లేదా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. తాను నిజంగానే పదవులు కోరుకుంటే 2009లోనే ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన సమయంలోనే ఎంపీ అయ్యే వాడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వైసీపీ నేతలు తాము చేసే అప్పులను కప్పిపుచ్చి, ప్రజలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
చాలా తటస్థంగా ఉన్నాను..
ఒక్క సినిమాను పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఉదాహరణకు తన భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుండి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వ్యవస్థలను వాడాలి అంటే వాడొచ్చు, కానీ ఇదే వ్యవస్థను దివ్యాంగులకు పింఛన్ లాంటివి ఇప్పించేందుకు ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఈ వ్యవస్థలి సరిగ్గా వాడుకోవాలని ఏపీ ప్రభుత్వానికి పవన్ సూచించారు. బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడు రాసిన రాజ్యాంగంను సరిగ్గా పాటిస్తే చాలు అని, కొత్త వ్యవస్థల్ని తీసుకురావాల్సిన పని లేదంటూ ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
ప్రజల్లో మార్పు వస్తేనే వ్యవస్థలు మారతాయి...
ప్రజల మౌనం కొనసాగితే నేతల అవినీతి పెరిగిపోతుందని, రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలన్నారు పవన్. వ్యవస్థల్ని బలోపేతం చేసుందుకు జనసేనకు అవకాశం ఇవ్వాలని, తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వ్యాఖ్యానించారు. అదే వైసీపీ నేతలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో తమకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ముందు ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు నోరు మెదపరన్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.