Chndrababu: ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి టీడీపీ అధినేత చంద్రబాబు 75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రతి ఒక్కరి గుండెలలో జాతీయ స్ఫూర్తి నింపాలని అన్నారు. రాజకీయ నాయకులు, అమరవీరులు చేసిన త్యాగాలే ప్రజలలో దేశభక్తి నింపాయి. దేశ ప్రజలు ఏకమై పోరాడి సాధించిన విజయమే దేశ స్వతంత్ర్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. గత చరిత్రను నెమరవేసుకుంటూ భవిష్యత్తుతో సమన్వయ పరుచుకోవాలన్నారు. పరాయి పాలనలో ప్రజలు పేదరికాన్ని అనుభవించారని నాటి సంగతులను గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నాయకులు సరికొత్త విధానాలు తెచ్చారని స్పష్టం చేశారు.
ప్రపంచంలో దేశం అగ్రగామి
ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కవ మంది భారతీయులే ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపాయన్నారు. జాతీయతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కరోనా సమయంలో అన్ని రంగాలు లాక్ డౌన్ లోకి వెళ్ళాయని కేవలం రైతులు మాత్రమే లాక్ డౌన్ చేయలేదని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా మన భారత దేశం ఎదిగిందని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే గొప్పగా ఐటీ, సేవా రంగాలలో భారత దేశం ఎదిగిందని చెప్పారు. గతంలో పేదరికంతో మగ్గిన మనం.. అభివృద్ధి చెందిన దేశాలకు ప్రస్తుతం సవాల్ విసురుతున్నామని పేర్కొన్నారు.
దేశానికి ఏమిచ్చాం
75 సంవత్సరాల తర్వాత, రైతు ఆత్మహత్యలు, పేదరికం ఉండటం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. నిర్ణయం కరెక్టుగా లేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. నేను ఈ దేశానికి ఏమి ఇచ్చామన్న భావన యువతలో రావాలని సూచించారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు. పబ్లిక్ జీవితంలో ఉన్న నాయకులు విలువలు కాపాడుకోవాలని వివరించారు. భారత దేశానికి యువత ఒక వరం అని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే శక్తి యువతకు ఉందన్నారు. నాలెడ్జీ ఎకానమీలో భారత దేశం ముందుందని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజికంగా వెనుక బడ్డారని తెలిపారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజ అసమానతలు తగ్గించడానికి వెచ్చించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటు
రైతులు ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి సిగ్గు చేటని పేర్కొన్నారు. మగవారితో సమానంగా మహిళలు ఐటీలో రాణిస్తున్నారని తెలిపారు. అందువల్లే వరకట్నం లేకుండా పోయిందని చెప్పారు. గంగా, కావేరి నధులను అనంధానం చేయాలని పేర్కొన్నారు. అవినీతి ఎక్కడ ఉంటే.. సమాజం అక్కడ కలుషితం అవుతుందని వివరించారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని చంద్రబాబు తెలిపారు. అవినీతిని నిర్మూలిస్తే రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలో నెంబర్ వన్ గా భారత దేశం ఎదుగుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాలలో తెలుగు వాళ్లు సంపద సృష్టి కర్తలు అవతారన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు జన్మ భూమిని, కర్మ భూమిని మరవవద్దుని పేర్కొన్నారు. ప్రజలలో బాద్యత, జాతీయ స్పూర్తి పెంచేందుకు ప్రజల మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించానని వివరించారు.