Independence Day 2022: దేశంలో చిట్టచివరి పేదవాడి కన్నీరు కూడా తుడవడమే ప్రభుత్వాల విధి అన్న జాతి పిత మహాత్మా గాంధీజీ ఆశయానికి అనుగుణంగా... రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, శకటాల ప్రదర్శనను వీక్షించారు సీఎం జగన్. 75 ఏళ్ల స్వతంత్ర భారతం తిరుగులేని విజయాలు సాధించిందని ముఖ్యమంత్రి జగన్ కీర్తించారు.


పలు రంగాల్లో అగ్ర స్థానంలో భారత్.. 
ఆహారం, ఔషధాలు, స్మార్ట్ ఫోన్ల రంగంలో అగ్రశ్రేణి దేశంగా ఎదిగిందన్నారు. 1947లో దేశంలో కేవలం 18శాతం వ్యవసాయ భూమికే సాగునీటి సదుపాయం ఉండగా... ప్రస్తుతం అది 49శాతానికి చేరిందన్నారు. ఫార్మా రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం దేశం సత్తాకు నిదర్శనమని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత ఆహారధాన్యాల లోటు లాంటి ఎన్నో సవాళ్లు ఎదురు కాగా... ప్రస్తుతం 150 దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామన్నారు. ఏపీ ప్రభుత్వం సైతం పలు రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఉత్పాదకత సాధిస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల శ్రేయస్సుకు పాటుపడటం తమ ప్రభుత్వ ప్రత్యేకత అన్నారు.


3 ఏళ్లలో ఏపీలో ఎన్నో మార్పులు సాధించాం.. 
తమ ప్రభుత్వం పాలనలో 3ఏళ్లలో గట్టి మార్పు సాధించి చూపామన్నారు. రైతు సంక్షేమానికే లక్షా 27వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా అన్నం పెట్టే రైతన్నకు భరోసాగా నిలిచామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే ఫించన్ అందించడం తమ పనితీరుకు నిదర్శనమన్నారు. 3ఏళ్లలో 40వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అమ్మఒడితో పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసాగా నిలిచామన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లతో సామాజిన న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమని స్పష్టం చేశారు.