ఇటీవల కరీంనగర్ లో కోవిడ్ నిబంధనలు పాటించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని ప్రజలు వాటిని పాటించాలని రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విన్నవించుకుంటున్నారు. అయితే నిబంధనలు ప్రతిపక్షపార్టీలకు మాత్రమే అన్నట్లు అధికారపార్టీ నేతల తీరు ఉందని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు కూడా వారి పక్షానే మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటనను మరో ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
రైతు బంధు వారోత్సవాల్లో ర్యాలీ
శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యే సార్ వస్తున్నాడంటే మాటలా...అధికారపార్టీ నేతలు ఏర్పాట్లు బాగానే చేశారు. డప్పుల మోతతో ఊరేగింపుగా పెద్ద ర్యాలీ చేపట్టారు. ఇది చూసిన ఓ బీజేపీ కార్యకర్త నిబంధనలు ప్రతిపక్షాలకేనా అంటూ ఆగ్రహంతో డయల్ 100కు కాల్ చేశాడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తమ గ్రామంలో ర్యాలీలు సభలు వద్దని కోరాడు. ఎమ్మెల్యే ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించడంలేదని ఆరోపించారు.
Also Read: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కాల్ చేసిన వ్యక్తినే అదుపులోకి తీసుకున్న పోలీసులు
డయల్ 100 కు కాల్ చేయగానే రెక్కలు కట్టుకుని వాలిపోతాం అని చెప్పే పోలీసులు వెంటనే ఆ ఊరికి వచ్చారు. పోలీసులకు ఊరిలో చేపట్టిన ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించడంలేదని ఫిర్యాదు చేశాడు. అయితే బీజేపీ కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఎస్సై తీసుకురమ్మన్నారని బీజేపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేస్తే అన్యాయంగా తనను ఎందుకు పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నారని యువకుడు ఆరోపించాడు. అక్కడికి వచ్చిన నలుగురైదుగురు పోలీసులు యువకుడ్ని ఎత్తి పోలీసు బండిలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. డయల్ 100కు కాల్ చేసిన సతీష్ అనే బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకోవడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. రక్షించాల్సిన వాళ్లే ఇలా చేస్తుంటే ఎలా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు వర్సెన్ ఎలా ఉంటుందో చూడాలి మరి అంటున్నారు స్థానికులు. బీజేపీ కార్యకర్తలు కావాలనే ఇలా చేస్తున్నారని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ర్యాలీ చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Also Read: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...