Kaleswaram Commission report will be tabled in Assembly: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం .. కేబినెట్ మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్య అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించిన తర్వాత రేవంత్ మాట్లాడారు. 665 పేజీల నివేదికను సభ్యులందరికీ ఇస్తామని.. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరూ స్వేచ్చగా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నివేదికను ఆమోదించామని తెలిపారు. ఎలాంటి ఊహాగానాలుక తావు లేకుండా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని అనుకుంటోందని తెలిపారు.
కాళేశ్వరం నిర్మాణం జరిగిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిపోయిందని. అన్నారం..సుందిల్ల లో పగుళ్లు వచ్చాయన్నారు. లక్ష కోట్ల ప్రాజెక్టు కూలిపోవడం తో విచారణ చేస్తాం అని మేము చెప్పామని.. మాట ప్రకారం కమిషన్ విచారణ కి ఆదేశించామని రేవంత్ గుర్తు చేశారు. కమిషన్ ఏడాదిన్నర పాటు విచారణ జరిపి అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు. ఊహాగానాలకు తావు లేకుండా ఉండటానికి సంక్షిప్తంగా వివరాలు వెల్లడించామని తెలిపారు. పూర్తి రిపోర్టును.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులందరూ స్వేచ్చగా అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇస్తామన్నారు. అందరి అభిప్రాయాలను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.
నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాత అందరి అభిప్రాయంతోనే చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్, హరీష్ రావు కూడా తమ అభిప్రాయాలను కూడా చెప్పవచ్చన్నారు.నివేదిక సూచనలను ప్రభుత్వం పాటిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ నివేదిక కాదన్నారు. ఇండిపెండెంట్ జ్యూడిషియల్ రిపోర్ట్ అని గుర్తు చేశారు. వ్యక్తిగత ద్వేషంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టల నిర్మాణంపై విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో స్పష్టం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కమిషన్ కేసీఆర్, హరీష్‌రావు సహా అనేక మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించిందని రేవంత్ గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.