Kaleshwaram Report n Cabinet: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి చిన్న నివేదికను కమిటీ కేబినెట్ కు సమర్పించారు.  650 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ.. ఆ నివేదికను కేబినెట్ కు సమర్పించింది.  60 పేజీల సంక్షిప్త నివేదిక లో 32 సార్లు కేసిఆర్, 19 సార్లు హరీష్ రావు, 5 సార్లు ఈటల పేరు ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్యారేజ్ ల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని.. కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్  తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదిక లో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అప్పుడు ఆర్ధిక మంత్రి గా ఉన్న ఈటల ఉదాసీనంగా, నిర్లక్ష్యం గా వ్యవహరించారని తప్పు పట్టింది. కొందరు అధికారులు  తప్పుడు సాక్ష్యాలు  సమర్పించారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక అక్రమాలు, సాంకేతిక లోపాలు, మరియు విధానపరమైన ఉల్లంఘనలు జరిగాయని కమిషన్ గుర్తించింది. మెడిగడ్డ బ్యారేజ్‌లో 2023 అక్టోబర్‌లో జరిగిన నిర్మాణ పతనం, అన్నారం,  సుందిళ్ల బ్యారేజ్‌లలో కనిపించిన నిర్మాణ లోపాలు ఈ విచారణకు దారితీశాయి. ప్రాజెక్టు ఖర్చు మొదటి అంచనా రూ. 81,000 కోట్ల నుండి  రూ. 1.5 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది ఆర్థిక అవినీతికి సూచనగా కమిషన్ పేర్కొంది.  KCR ప్రాజెక్టు   ప్రణాళిక, నిర్మాణం  అమలులో జరిగిన అక్రమాలకు "ప్రత్యక్షంగా , పరోక్షంగా" బాధ్యత వహించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.  నిపుణుల సలహాలను పట్టించుకోకుండా తప్పుడు వాదనలు చేసినట్లు, ఆర్థిక నిర్లక్ష్యానికి పాల్పడినట్లు కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. 

 అప్పటి ఇరిగేషన్ మంత్రిగా, హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని, అక్రమాలకు బాధ్యత వహించాలని నివేదికలో ప్రస్తావించారు.  అప్పటి ఆర్థిక మంత్రిగా, ఈటల రాజేందర్ బ్యారేజ్ నిర్మాణానికి కేబినెట్ సబ్-కమిటీ సిఫారసు మరియు కేబినెట్ అనుమతి ఉందని తప్పుడు సమాచారం అందించారని కమిషన్ గుర్తించింది. కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలను సమర్పించారని కమిషన్ గుర్తించింది. వీరిలో ఇరిగేషన్ & CAD ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె. జోషి, సీఎంకు సెక్రటరీ స్మితా సభర్వాల్ తదితరులు ఉన్నారు. ఈ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది.

కమిషన్ సిఫారసుల ఆధారంగా, బాధ్యులపై చట్టపరమైన చర్యలు, దెబ్బతిన్న బ్యారేజ్‌ల మరమ్మతు,  ఆర్థిక నష్టాలను రికవరీ చేసే అవకాశాలను కేబినెట్ చర్చించినట్లుగా తెలుస్తోదంి.  ప్రాజెక్టు   దీర్ఘకాలిక స్థిరత్వం కోసం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. - నివేదికలోని కొన్ని భాగాలను పారదర్శకత కోసం ప్రజలకు విడుదల చేయవచ్చని, అయితే సున్నితమైన వివరాలను చట్టపరమైన విచారణ పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచవచ్చని  చెబుతున్నారు.