PKVY Scheme: సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి పథకం (పరంపరాగత్ కృషి వికాస్ యోజన - పీకేవీవై) కింద తెలంగాణలో 34 వేల 500 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని కేంద్రం ప్రకటించింది. 690 క్లస్టర్లలో 13,800 హెక్టార్లు సాగులో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, బొర్లకుంట వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 


ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్‌ ప్రైజెస్ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.65 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు.. ఈ మేరకు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నూనె దిగుమతుల తగ్గింపు, స్వయం సమృద్ధి సాధనకు గానూ జాతీయ ఎడిబుల్ ఆయిల్ మిషన్ - ఆయిల్ పామ్ (ఎన్ఈవో-వోపీ) కింద ఆయిల్ పామ్ సాగు పెంపు కోసం తెలంగాణ రాష్ట్రానికి 2018-19 నుంచి 2022-23 వరకు రూ.352.94 కోట్లు కేటాయించి రూ.121.36 కోట్లు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చింది కేంద్రం. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగి ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం అందించారు. 


17 లక్షల 32 వేల 936 మంది కార్మికుల పేర్లు తొలగింపు


ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 2021-22 లో 61,278 మంది, 2022-23లో 17,32,936 మంది కార్మికుల పేర్లు తొలగించినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సభలో చెప్పారు. అలాగే తెలంగాణలో ఇద్దరు మహిళలను ఉద్యోగాల సాకుతో అక్రమ రవాణా చేశారని ఎన్ఐఏ కేసు నమోదు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. ఈ మేరకు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పుకొచ్చారు. 


పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటే ఏంటీ?


సేంద్రియ పంటలకు ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా కేంద్రం  పరంపరాగత్ కృషి వికాస్ యోజన తీసుకువచ్చింది. ఈ పథకంలో రైతుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. సహజ ఎరువులు, జీవ పురుగుమందుల వంటి వాటిని కొన్నా వాటికి కూడా డబ్బు ఇస్తారు. ఏ పంటకు ఎంత మోతాదులో ఇవి వాడాలన్నది పూర్తిగా రైతు ఇష్టం. రైతులే సొంతంగా సహజ ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకోవడానికి కూడా ఈ పథకంలో అనుమతిస్తారు. ఇప్పటిదాకా రసాయనాలు వాడుతున్న పొలంలో పీకేవీవై కింద పంటలు పండించాలంటే కచ్చితంగా వరుసగా మూడేళ్ల పాటు సాగు చేస్తేనే సేంద్రియ అనే పూర్తి స్థాయి గుర్తింపు లభిస్తుంది. ఒకే చోట 2500 ఎకరాల వరకూ రైతులు ఈ పథకం కింద పంటలు పండించడానికి ముందుకు వస్తే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి