Minister Errabelli : ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాకే తెలంగాణలో ప్రగతి పరుగులు పెడుతుందని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వినూత్న పథకాలతో విశిష్ట ప్రగతిని సాధించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని జీకే తండాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతిథిగా పాల్గొన్నారు.   ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు 


నాగార్జునసాగర్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కట్టలేకపోయారని దీంతో రాష్ట్రం ఉమ్మడి పాలకుల ఆధ్వర్యంలో అనాధగా,  కరువు కాటకలతో ఇబ్బందులు పడ్డామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కేవలం రెండున్నర ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రపంచ రికార్డ్ సృష్టించారని మంత్రి తెలిపారు. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాజెక్టుగా అతి తక్కువ సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుతూ నీటిని పారిస్తూ రిజర్వాయర్లను నింపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత  కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇవాళ తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని చెరువులన్నిటిని నింపి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేశామన్నారు. 


కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తుంది


 అలాగే రైతులకు గతంలో ఎక్కడా లేని విధంగా వినూత్న విశేష పథకంగా రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తూ, పంటలు బాగా పండడానికి, పండిన పంటలను కూడా కొనుగోలు చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన నేత సీఎం కేసీఆర్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తుంటే, అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ తన పాణం ఉన్నంతవరకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని ఎర్రబెల్లి చెప్పారు.


సంక్షేమంలో మనమే నెంబర్ వన్


50వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, బీడీ గీత కార్మికులు, ఎయిడ్స్,  బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు వంటి వారికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే అన్నారు. కేసీఆర్ కిట్లు, దళిత బంధు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గం లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న గ్రామాల్లో అందుతున్న ఆయా పథకాలను మంత్రి ప్రజలకు వివరించారు.  


గత పాలకులకు విజన్ లేకపోవడం వల్లే  


ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులకు విజన్ లేకపోవడం వల్లే పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాలు కుంటుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో  రాష్ట్రం సర్వనాశనం అయింది. టీడీపీ పాలనలో లోపించిన ముందుచూపు కారణంగా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో పరిపాలన అద్భుతంగా సాగుతూ, అభివృద్ధి సంక్షేమాలు పరుగులు పెడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా ప్రజా అవసరాలు తీరుస్తూ ప్రజలకు కావలసిన పథకాలను రూపొందించి అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.