Munugode Tension :  మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చివరి రోజున పలిమెల గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  పలివెల గ్రామంలో బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో.. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గలేదు. ఈ ఘర్షణ ముదిరి చివరికి దాడులకు కారణం అయింది.



పలివెలలో  టీఆర్ఎస్  - బీజేపీ మధ్య ఘర్షణ 


టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడితో అక్కడ పరిస్థితి  భీతావహంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు కాళ్లపై పడ్డాయి. బీజేపీ ప్రచార వాహనాన్ని చించేసారు. ఈ ఘటన తర్వాత పోలీసులు భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ అంశఁపై తప్పు మీదంటే మీదని రెండు రాజకీయ పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలే .. తమ పైకి వచ్చి రెచ్చగొట్టారని.. దాడులు చేశారని.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఈటల రాజేందర్ ఆరోపించారు. పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు. మరో వైపు టీఆర్ఎస్ నేతలు.. మాత్రం తమను బీజేపీనే రెచ్చగొట్టిందని విమర్శలు గుప్పించారు. పరస్పరం రాళ్ల దాడి జరిగిందని బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 


పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు దాడులు చేశారన్న ఈటల వర్గీయులు


టీఆర్ఎస్ కార్యకర్తలు..  బీజేపీ ప్రచార వాహనాలపై దాడులకు పాల్పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాళ్లు విసిరి కర్రలతో దాడులు చేశారు. ఈటల రాజేందర్‌ సొంత హవాహనం అద్దాలు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. ఈ దాడికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వం వహించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనే దగ్గరుండి దాడులు చేయించారని అంటున్నారు. 


దాడుల ఘటనలతో మరింత భద్రత పెంచిన ఈసీ


మరో వైపు ప్రచారం చివరి రోజున తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటంతో.. ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించిది. వెంటనే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. సాయంత్రం ఆరు గంటలకు.. మునుగోడులో  ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోతుంది. ఆ తర్వతా నియోజకవర్గంలో.. ఇతరులు ఎవరూ ఉండకూడదు.  ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచారు. దాడులు, దౌర్జన్యాలు, రాజకీయ పార్టీల కార్యకర్తల ఘర్షణలను సీరియస్‌గా తీసుకోవాలని సిబ్బందికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 


పోలింగ్ రోజున మరింత టెన్షన్ 


ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా  దాడులు చేశారు. ఇప్పుడు బీజేపీకి చెందిన వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయని... పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకోనుంది.