Twitter Blue Badge:  ట్విటర్‌ను టేకోవర్‌ చేసినప్పటి నుంచీ ఎలన్‌ మస్క్‌ దూకుడుగా కనిపిస్తున్నాడు. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎన్నికల సమయంలో డెమొక్రాట్లకు అనుకూలంగా, భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా పనిచేశారని భావించిన ఉద్యోగులందరినీ తొలగించాడు. ఈ క్రమంలోనే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌ హెడ్‌ విజయను మిగతా ఉద్యోగుల ముందే అవమానకరంగా బయటకు పంపించేశాడు! బోర్డు మొత్తాన్ని రద్దు చేసి ఏకైక డైరెక్టర్‌గా మారాడు.




అనూహ్య మార్పులు చేసిన ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు సంస్థాగతంగా, అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడని తెలిసింది. ట్విటర్‌ను మునుపటి కన్నా భిన్నంగా మార్చేందుకు ప్రయత్ని్స్తున్నాడు. సోషల్‌ మీడియా ఖాతాల పట్ల మరింత విశ్వసనీయతను పెంచేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఒక అకౌంట్‌ అథెంటిక్ అవునో కాదో తెలుసుకొనేందుకు బ్లూటిక్‌ ఇస్తున్నారు. ఇకపై బ్లూ టిక్‌ ఇచ్చే ప్రక్రియను మస్క్‌ మార్చబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.




ప్రస్తుతం బ్లూ టిక్‌ ఉన్న వాళ్లు త్వరలోనే వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందట! నెలకు 4.99 డాలర్లతో ఆప్షనల్‌ ప్లాన్‌ ఉంటుందని తెలిసింది. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఇస్తారని సమాచారం. కొత్తగా బ్లూ టిక్‌ కావాలని కోరుకునేవాళ్లకు 19.99 డాలర్లు ఫీజు వసూలు చేయనున్నారని వెర్జ్‌ రిపోర్టు చేసింది ఇప్పుడీ ప్లాన్‌లో ఉన్నవారు 90 రోజుల్లోగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని లేదంటే చెక్‌ మార్క్‌ తొలగిస్తారని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారని తెలిసింది. కొత్త ఫీచర్‌ కోసం కొందరు ఉద్యోగులను నియమించారని, నవంబర్‌ 7లోగా ప్రాజెక్టు పూర్తి కాకుంటే వారు ఇంటికెళ్లాళ్లి ఉంటుందట. పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.




'మొత్తం వెరిఫికేషన్‌ ప్రక్రియ ఈ క్షణం నుంచే మారబోతోంది' అని మస్క్‌ ఆదివారం ట్వీట్‌ చేశాడు. అయితే ఏ మార్పులు వస్తాయో మాత్రం చెప్పలేదు. ట్విటర్‌ చీఫ్‌ మీమ్స్‌ ఆఫీసర్‌ జేసన్‌ కొన్ని రోజుల క్రితమే ఓ ట్వీట్‌ పెట్టాడు. 'మీరు తనిఖీ చేసుకోవడానికి, ట్విటర్‌ బ్లూ మార్క్‌ పొందడానికి ఎంత చెల్లిస్తారు? నెలకు 4 డాలర్లు, 10 డాలర్లు, 15 డాలర్లు, అసలు చెల్లించరు' అని ఆయన పెట్టిన ట్వీట్‌కు మస్క్‌ 'ఆసక్తికరం' అని స్పందించాడు. వీటి ఆధారంగానే మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మస్క్‌ అధికారికంగా చెప్పేంత వరకు ధ్రువీకరణ రాదు.