నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.


నిజాం రాజు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938లో తొలిసారి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎంతో లాభాల బాటలో పయనించింది. స్వాతంత్రం తర్వాత 1950లో ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో 13 యూనిట్లను ఏర్పాటు చేశారు. షుగర్ ప్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 6 వేల మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు.


మెదక్, బోధన్, మెట‌్‌పల్లిలోని ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంఛర్ పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా బలవంతంగా 1200 మందికి వీఆర‌్ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టెకోవర్ చేసుకున్నారు. గోకరాజు గంగరాజు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం జాయింట్ వెంచర్‌లో ఫ్యాక్టరీని నడిపించారు. ప్రైవేట్ యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంటామని జీవో విడుదల చేసింది. 2015లో గోకరాజు ఉన్నఫలంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండునే లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు.


ఏడేళ్ల నుంచి ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 40 మంది కార్మికులు గుండెపోటు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోయారు. ఉన్నఫలంగా ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. కేసును ప్రభుత్వం లేబర్ కోర్టుకు రిఫర్ చేసింది. గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అంగీకరించలేదని కార్మికులు చెబుతున్నారు. అయితే గోకరాజు నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యూనల్ కు ( NCLT) అప్రోచ్ అయ్యారు. రాజకృష్ణ గుప్తను లిక్విడేటర్ గా అపాయింట్ చేసింది ఎన్ సీ ఎల్టీ. కార్మికులు చేసిన క్లైంసిని లిక్విడేటర్ రాజకృష్ణ గుప్త అంగీకరించలేదు. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న సమయంలో 2019లో మార్చిలో ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి చెల్లింపులు జరపాలని చూసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు అమ్మొద్దని అప్పీల్ చేసింది. దీంతో దీంతో ఎన్సీఎల్టీ జడ్జిమెంట్ ఇవ్వకుండానే కేసును డిస్ మిస్ చేసింది.


ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ఎటూ తేల్చకపోవటంతో కార్మికులు 7 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎందరి చుట్టు తిరిగినా ప్రయోజనం లేదని కార్మికులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు కార్మికులు.


200 మంది కార్మికులు 40 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 100 మంది కార్మికులు మిగిలారు. వారిలో కొంత మంది వయసు కుడా మీద పడింది. ఏ దిక్కు లేక కార్మికులు చిన్న చిన్న కిరాణ కొట్టులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాంటున్నారు. కనీసం తినటానికి తిండికూడా లేదని వాపోతున్నారు. ఎంత మంది నాయకుల వద్ద తిరిగినా ప్రయోజనం లేదని భావించిన కార్మికులు చివరకు ఫ్యాక్టరీ భూములను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతామని కార్మికులు చెబుతున్నారు. ఏడేళ్లుగా తమకు రావాల్సిన ఎక్స్ గ్రేషియా. జీతాలు ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. చేసేది లేకే ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగామని చెబుతున్నారు ఫ్యాక్టరీ కార్మికులు.