బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఇటివలే చిరుతపులి ఆవులపై దాడి చేయడం.. ఈ ఘటనలు మరవకముందే.. శనివారం చిరుతపులి ఓ మహిళ పైన దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే...
బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన అర్క భీంబాయి ఉదయం పూట బహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుతపులి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. చిరుతపులి దాడిలో మహిళ కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఛాక చక్యంగా ఆమె తప్పించుకొంది. ఖంగారు పడుతూ వచ్చిన ఆమెను స్థానికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారు. మహిళపై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.
విషయం తెలుసుకున్న ఆటవిశాఖ అధికారులు ఆమేను పరామర్శించి తాత్కాలిక సహయంగా 5000 రూపాయలు అందించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఏబిపి దేశం ఇచ్చోడ రేంజ్ అటవీ అధికారి పుండలిక్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు. డెడ్రా ప్రాంతంలో చిరుత సంచారం వాస్తవమేనని, చిరుత దాడి చేయడంతో భీంభాయి అనే మహిళ గాయపడిందని, ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించగా.. అటవీ శాఖ తరఫున తాత్కాలిక సహాయంగా 5000 రూపాయలను అందించాం అన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
చిరుత సంచారం మీ పతంలో స్థానికులు సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయ రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి సంచారం తమ ప్రాంతంలో లేదని చిరుతపులి సంచారం మాత్రమే ఉందని, ప్రజలు ఎవరు కూడా వాట్సాప్ మాధ్యమాలలో వచ్చే పుకార్లు నమ్మవద్దని, వాస్తవాలు ఏమైనా అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలుసుకోవాలని, ఏదైనా సమాచారం ఉంటే అటవీశాఖ అధికారులకు తెలపాలని సూచించారు.