Telangana Panchayat Elections | ఇంద్రవెళ్లి: వాళ్ళది ఒకే కుటుంబం.. వరుసకు సొంత అత్త, కోడళ్ళు.. కానీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి నేనంటే నేను సై అంటూ పోటీకి దిగారు. మొదటి విడతలో నామినేషన్ కూడా వేసారు. ఇప్పుడు పోటీకి నేనంటే నేను సై అంటూ ముందుకు వెళ్తున్నారు ఈ అత్తా కోడళ్ళు.. ఒకే కుటుంబంలో వీరి పోటీని చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి దిగిన అత్తా కోడళ్ళపై abp దేశం స్పెషల్ స్టోరీ.

Continues below advertisement

పోటాపోటీగా అత్తాకోడళ్ల నామినేషన్లు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామపంచాయతీ ఇది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలవేళ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ హిరాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు.. వరుసకు అత్తా, కోడళ్ళు... అవును నిజమే... వీళ్లిద్దరూ వరుసకు సొంత అత్త కోడళ్ళు.. అత్తా తొడసం లక్ష్మీబాయి.. కోడలు తొడసం మహేశ్వరి.. ఈ ఇద్దరు హిరాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీకి సిద్ధం అయ్యారు. మొదటి విడతలో నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గా నేనంటే నేను గెలుస్తానంటూ ఒకరికొకరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

అందరూ పరిచయమే.. నన్నే గెలిపిస్తారు..

హిరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలున్నాయని, అందరూ తమకు పరిచయమనీ, తప్పకుండా అందరూ తనని గెలిపిస్తారంటూ తొడసం లక్ష్మీబాయి ఏబీపీ దేశంతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల పోటీలో తన సొంత కోడలు తొడసం మహేశ్వరి కూడా ఉందని, ప్రజలేవరీకి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారని, ఖచ్చితంగా ప్రజలు తనని గెలిపిస్తారని, తాను సర్పంచ్ గా గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తానంటున్నారు. తాను చదువుకోలేదని, తన తెలివితేటలతో, ఆలోచన విధానంతో పనిచేస్తానని, తప్పకుండా అందరూ తమకే పట్టం కడతారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చదువుకున్న యువతినే ఓటర్లు గెలిపిస్తారు..

తోడసం మహేశ్వరి సైతం ఎబిపి దేశంతో మాట్లాడారు. హిరాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచ్ గా పోటీకి నామినేషన్ వేయడం జరిగిందన్నారు. తాను ఇంటర్ ఐటిఐ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఉద్యోగం రాలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఈసారి మహిళకు అవకాశం రావడంతో ఈ హిరాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీకి సిద్ధమయ్యానన్నారు. చదువుకొని ఉన్నానని, అందరూ తనను తప్పకుండా గెలిపిస్తారంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను సర్పంచ్ గా గెలిస్తే తప్పకుండా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానాని, పోటీలో తన సొంత అత్త తొడసం లక్ష్మీబాయి కూడా ఉందని, ప్రజలెవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారని, అందరి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ప్రజలు చదువుకున్న వారిని, యువతనే ఎంచుకుంటున్నారని తెలిపారు.

తప్పకుండా తాను ఈ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్నారు. అయితే ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నలుగురు ఉండగా.. ఇద్దరు ఒకే కుటుంబం నుండి సొంత అత్త, కోడలు ఉండడం అందరిని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరి పంచాయతీ ప్రస్తుతం జిల్లాలో వైరల్ అవుతోంది.