Adilabad Road Accident| ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరేడిగొండ మండలంలోని బోథ్ క్రాస్ రోడ్డు సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి నుంచి గోరఖ్ పూర్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సులో మొత్తం 49 మంది ప్రయాణిస్తున్నారు. మిగతా వారు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న నేరడిగోండ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని జేసిబి సహాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..!
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని పోస్టు మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతి వేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.