Viral News: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకను ఎత్తుకెళ్లారనే నెపంతో మేక యజమానులు.... ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. దాడి చేయడమే కాకుండా తలకిందులుగా వేలాడదీసి, కింద నిప్పు పెట్టారు. అలా ఉండగానే కర్రలతో చితకబాదారు. మేకలను మాయం చేసింది మీరేనని ఒప్పుకోమంటూ వేధించారు. అలాగే మేక పోయినందుకు గాను 3 వేల రూపాయలు తమకు చెల్లించాలంటూ హింసించారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే...


మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. యాపల్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని గంగనీళ్ల పంపుల వద్ద షెడ్డు వేసి మేకలు పెంచుకుంటున్నారు. అయితే ఈ మందను చూసుకోవడానికి 19 ఏళ్ల తేజ అనే యువకుడిని పనిలో పెట్టుకున్నారు. తేజనే మేకలు కాస్తూ వస్తున్నాడు. అయితే అతని తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఈక్రమంలోనే ఎనిమిది రోజుల కిందట షెడ్డు నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. 


తాము కాదని అంటున్నా వినకుండా దాడి


విషయం తెలుసుకున్న యజమాని తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. నువ్వే మేకును దొంగిలించావంటూ వాదించాడు. అలాగే అదే ఏరియాకు చెందిన తాపీ మేస్త్రీ శ్రావణ్ వద్ద కూలీ పనులు చేస్తున్న చిలుముల కిరణ్ అనే వ్యక్తితో కలిసి మేకను దొంగిలించి ఉంటావంటూ తెలిపాడు. ఈక్రమంలోనే తేజతో పాటు కిరణ్ ను మేకల షెడ్డు వద్దకు రావాలని పిలిచాడు. అప్పటికే రాములుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. వీరంతా ముందుగా తేజ, కిరణ్ లను దొంగతనం ఒప్పుకోమని గొడవ చేశారు. వారిద్దరూ తాము మేకను దొంగిలించలేదని ఎంత వాదించినా వినకుండా... వారిని తలకిందులుగా వేలాడదీశారు. ఆపై కింద నిప్పు పెట్టి  మరీ కుటుంబ సభ్యులంతా కలిసి తీవ్రంగా కొట్టారు. మూడు వేల రూపాయలు ఇస్తే తప్ప వదిలిపెట్టేది లేదని అన్నారు. 






అయితే విషయం తెలుసుకున్న తాపీ మేస్త్రీ శ్రావణ్... డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి కిరణ్ ను విడిపించుకొని వెళ్లాడు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కిరణ్ కనిపించకుండా పోవడంతో అతని చిన్నమ్మ నిట్టూరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా వీరిని కొడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మేకల యజమానులు అయిన రాములు, స్వరూప, వీరి కుమారుడు శ్రీనివాస్ తో పాటు దాడికి సహకరించిన మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎనిమిది రోజుల క్రితం ఈ దారుణం జరగ్గా.. సెప్టెంబర్ రెండో తేదీన వెలుగులోకి వచ్చింది తేజను ఆస్పత్రికి తరలించగా.. దళిత యువకుడు కిరణ్ కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.