Union Minister Kishan Reddy fires at Congress government | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించి, పలు సమావేశాల్లో పట్టభద్రులతో సమావేశమయ్యారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ, ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్, మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్నాం. బీజేపీ మాత్రమే మూడు స్థానాల నుంచి పోటీ చేస్తోందన్నారు. విద్యావంతులు, ఉద్యోగులతో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో వేరే పార్టీలు పోటీ చేసే ధైర్యం చేయట్లేదు. మూడు సీట్లను బీజేపీ దక్కించుకుంటుందన్న నమ్మకం నాకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఉంది. ఉపాధ్యాయులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇక కాంగ్రేస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారంటీలు అమలు చేయట్లేదు. వీటిపై ఆయా వర్గాల వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 14 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండిపోతుందా అన్న పరిస్థితి ఉంది. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల వారికి ఎదో ఒక హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని వారికి అర్థం అయింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 400 రోజులు అవుతున్న అతీగతీ లేదు. గ్యారంటీల అమలులో ప్రభుత్వం దగ్గర కనీసం ఎలాంటి కార్యాచరణ లేదు. హామీలతో అర చేతిలో వైకుంఠం చూపిస్తుంది తప్ప.. అమలు విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మహిళలకు నెలకు ఇస్తానన్న రూ.2 వేలు ఎప్పుడిస్తారో తెలియదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.35 వేలు బాకీ పడింది. కల్యాణ లక్ష్మీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క జంట కు కూడా తులం బంగారం ఇవ్వలేదు. రైతు భరోసా కింద రైతుకు, రైతు కూలీకి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. 50 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పంటపై ఇస్తామన్న బోనస్ ఏది? ఏ గ్రామంలో ఇల్లు కట్టించలేదో ఆ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన మాటపై నిలబడాలని నేను డిమాండ్ చేస్తున్నా. పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇస్తామన్న రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమం కారులకు 250 గజాల భూమి, అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేలు ఇస్తానని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. యువ వికాసం పేరుతో విద్యా భరోసా కార్డులు ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వలేదు. పింఛన్ 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందో తెలియదు. దివ్యంగులు, పెన్షన్ దారులను కాంగ్రెస్ ప్రభుతం మోసం చేస్తూ కాలం వెళ్లబుచుతోంది.
ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం విజయవంతంగా అమలు అవుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణలో అమలు కాలేదు. కాంగ్రెస్ వచ్చాక కూడా పూర్తిగా అమలు చేయకుండా రోగులను ఇబ్బంది పెడుతోంది. గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన వారికి 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం గాల్లో దీపంలా ఉంచింది. రిటైర్ అయిన వారికి అందాల్సిన బెనెఫిట్స్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పీఆర్సీ అమలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంనిమ్మకు నీరెత్తినట్లువ్యవహరిస్తోంది.4 వేల నిరుద్యోగ భృతి ఊసు లేదు. బెల్ట్ షాపుల నిర్ములనపై ఎలాంటి చర్యలు లేవు. బీసీ సబ్ ప్లాన్, మైనారిటీ షబ్ ప్లాన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. బీడీ కార్మికులకు ఈఎస్ఐ పరిధిలోకి తెస్తామన్న హామీ ఏమైంది. జర్నలిస్టులకు ఇల్లు, ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామన్న హామీలు గాలికొదిలేశారు. పేదలకు సన్న బియ్యం.ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ ప్రధాని మోదీ గారు ప్రతి నెలా ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యం కూడా సరిగ్గా సరఫరా చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రూ.8 లక్షల కోట్ల కోట్ల అప్పులు తెచ్చింది. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్భం కూడా అదే దారిలో నడుస్తోంది. మా పార్టీ అధికారంలోకివస్తే చాలు.. రాష్ట్రం ఏం అయిపోయినా పర్లేదు అన్న ధోరణిలో హామీలు ఇచ్చి... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. డీఎస్సీ కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు రూ.80 వేళా కోట్ల అప్పుల్లో ఉన్నాయి. డిస్కంలకు ప్రభుత్వ సంస్థలు రూ.28,840 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటి బకాయిలు చెలించి నష్టాల నుంచి కాపాడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తోంది. నిజమైన తెలంగాణ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. నిజమైన మార్పు తెలంగాణలో అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజీపీ ని తెలంగాణ ప్రజలు ఆదరించారు. రానున్న రోజుల్లో కూడా మరింతగా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి గాడిద గుడ్డు సున్నా సీట్లు వస్తాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్, టీచర్ ఎన్నికలు మార్కుగా విద్యావంతులు, టీచర్లు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు.