Sirpur Latest News : హ్యాండ్ ఇస్తానని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు-సీఎం రేవంత్‌తో కోనేరు కోనప్ప భేటీ!
Koneru Konappa Latest News:సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రం ఫలిచింది. ఆయన్ని సీఎం పిలిచి మాట్లాడారు. దీంతో ఆయన మెత్తబడినట్టు సమాచారం.
Koneru Konappa Latest News: తెలంగాణా రాష్ట్రంలోని సిర్పూర్ నియోజకవర్గంలో నిన్నా మొన్నటి వరకు వేడెక్కిన రాజకీయం చప్పున చల్లారింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నారన్న వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే, అధిష్టానం జోక్యం చేసుకోవడం, ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడారు. దీంతో ఈ వ్యవహారం టీ కప్పులో తుఫానులా మారింది.
సిర్పూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గం. కేవలం నంబర్లోనే కాదు.. రాజకీయంగా కూడా అదే స్థాయిలో కొనసాగుతుంటుంది. ఎప్పుడూ ఏదో వ్యవహారంతో రాష్ట్రస్థాయిలో నిలుస్తుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం కూడా అదే స్థాయిలో వేడెక్కించింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ వీడతానని స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
పక్క జిల్లాకు చెందిన ఓ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్ ఇద్దరూ కలిసి సిర్పూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. కోనేరు కోనప్పను పక్కనపెట్టి మరీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా అన్నింటిలో కోనప్ప పాత్ర నామమాత్రంగా మారింది. ఈ వ్యవహారం నచ్చని కోనప్ప కాంగ్రెస్ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడం, గత ప్రభుత్వంలో ఆయన తీసుకువచ్చిన అభివృద్ధి పనులను సైతం పక్కన పెట్టడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. ఇలా తన పాత్ర నామమాత్రం కావడంతో వారం రోజుల కిందట సమావేశం ఏర్పాటు చేసిన కోనేరు కోనప్ప తాను ప్రజల మనిషిని అంటూ చెప్పుకొచ్చారు. పార్టీలతో సంబంధం లేదని ప్రజల మద్దతుతో గెలుస్తున్నాని స్పష్టం చేశారు. కాంగ్రెసు దొంగల గుంపుగా విమర్శించారాయన. సిర్పూర్ కాగజ్నగర్లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. స్వతంత్రంగా ఉంటానని కోనప్ప ప్రకటించారు.
కోనప్ప నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడితే తీరని నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన కాంగ్రెస్ ఆయన పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంది. సీఎం కార్యాలయం నుంచి కోనప్పకు ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి కలవాలనుకుంటున్నారని శనివారం ఉదయం రావాలన్నది ఆ ఫోన్ సారంశం.
సీఎంవో నుంచి ఫోన్ రావడంతో శనివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కోనప్ప. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో ఉన్నారు. అంతా కలిసి గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
సిర్పూర్ నియోజక వర్గ అభివృద్ధి, పెండింగ్ బిల్లులు, పనుల మంజూరుపై ముఖ్యమంత్రితో కోనప్ప మాట్లాడారు. వాటన్నంటికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో కోనేరు కోనప్ప మెత్తబడ్డట్లు సమాచారం. అయితే ఈ వ్యవహరం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. సిఎం హామీతో కోనప్ప రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో సిర్పూర్ నియోజకవర్గ రాజకీయం మళ్ళీ వెడెక్కింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది.