TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

Maha Shivaratri 2025 :మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతోంది. వీటికి యాభై శాతం టికెట్ రేట్లు పెంచింది.

Continues below advertisement

Maha Shivaratri 2025 Special Buses In Telangana: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శివాలయాలను దర్శించుకోవాలని భక్తులు ఆశిస్తుంటారు. అందుకే వారి కోసం ప్రత్యేక బస్‌లు నడపాలను నిర్ణయించింది. అందుకే నాలుగు రోజుల పాటు అంటే ఈనెల 24 నుంచి 28 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక బస్‌లు నడపబోతోంది. 

Continues below advertisement

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలు భక్తులు సందర్శించుకునేలా తెలంగాణ ఆర్టీసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ శివాలయాలు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా మూడు వేల బస్‌లను నడుపుతోంది. ఈ వివరాలను ఆర్టీఎండీ సజ్జనార్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఐదు రోజుల పాటు ఈ సేవలు అందుతాయని తెలిపారు. 

ఏ శైవక్షేత్రానికి ఎన్ని బస్‌లు నడుపుతున్నారో ఆ వివరాలను కూడా సజ్జనార్ వెల్లడించారు. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులు నడపనున్నారు. వీటితోపాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప లాంటి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తనున్నారు. వారి కోసం కూడా ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు.  

ఈ బస్‌లు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా వేసవి కాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేసింది.  

Also Read: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - హంసవాహనంపై ఆది దంపతులు!

శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలు పెంచింది. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 27 తేదీ (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించింది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తించనున్నాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.  

శివరాత్రి ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయన ఆదేశాల మేరకు టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.  

శివారాత్రి ఏర్పాట్లపై ఆయా జిల్లా, శైవక్షేత్రాల డిపో మేనేజర్లతో యాజమాన్యం సమీక్ష నిర్వహించింది. 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొంది. గత శివరాత్రి కన్నా 809 బస్సులు అదనంగా తిప్పుతున్నట్టు తెలిపింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సేవలను ఉపయోగించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవాని క్షేమంగా ఇంటికి చేరాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. 

Also Read: అఘోరాలు పూజించే శివుడి రూపం ఇలా ఉంటుంది.. మీరు పూజించే రూపానికి పూర్తి భిన్నంగా!

Continues below advertisement
Sponsored Links by Taboola