ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టు 4 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ఒక్కసారిగా తర్ణం వాగులో వరద ఉద్ధృతి పెరిగి రెండు లారీలు వాగులో మునిగాయి. దీంతో అదిలాబాద్ నుంచి జైనథ్ బేల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారు అడ గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. లారీలో చిక్కుకున్న వారిని స్థానికులు తాళ్ళ సహాయంతో బయటకు తీసి కాపాడారు.
టవేరా వాహనం వాగులో కొట్టుకుపోయిందిఅలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖోజా కాలనీ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో, టవేరా వాహనంలో వెళ్తున్న వ్యక్తి అప్రమత్తమై అందులోంచి దిగిపోయాడు. వరద ఉద్ధృతికి అతని టవేరా వాహనం వాగులో కొట్టుకుపోయింది. ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వాగు అవతల చిక్కుకుపోయిన నలుగురుఅటు మరోపక్క మంచిర్యాల జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు వాగులో చిక్కుకుపోగా, స్థానికులు తాళ్ల సహయంతో కాపాడారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో వాగు అవతల చిక్కుకుపోయిన నలుగురు యువకులను స్థానికులు కాపాడారు. కాసిపేట మండలం బుగ్గచెరువు వద్ద చేపలు కోసం నలుగురు యువకులు వాగుదాటి అవతలి ఒడ్డకు వెళ్లారు. భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వాగు పెద్దఎత్తున పొంగిపొర్లింది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. దీనిని గమనించిన స్థానికులు తాళ్ల సహయంతో ఆ నలుగురిని కాపాడారు. అధిక వర్షాల కారణంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని ముఖ్యంగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇటు నిర్మల్ జిల్లాలోను కడెం ప్రాజెక్టు దిగువన వదిలిన ప్రవాహానికి కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. చేపలు పట్టడానికి వెళ్లిన గంగాధర్ కడెం ప్రాజెక్టు దిగువన ప్రవాహానికి కొట్టుకుపోయాడ. అతనికోసం NDRF బృందాలతో గాలిస్తున్నారు. ప్రవాహాలు ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.