Nizamabad Police Commissioner key instructions | నిజామాబాద్: ప్రజల భద్రత, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు నిజామాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడడం కోసం, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేదుకు కొన్ని నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజలకు సూచనలు చేశారు. ఈ ఆదేశాలు 16-08-2025 నుంచి 31-08-2025 వరకు అమలులో ఉంటాయి.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలోని పోలీస్ స్టేషన్ల అధికారులకు చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు. ప్రజలందరూ ఈ నిబంధనలను పాటించి పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ సీపీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి డ్రోన్ల వినియోగంపై పలు సూచనలు చేశారు.
1) విగ్రహాల ప్రతిష్టాపనపై మార్గదర్శకాలు:పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ఎలాంటి విగ్రహాలు ప్రతిష్టించకూడదు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ప్రభుత్వ భవనాల సమీపాలు, ఐలాండ్‌లలో విగ్రహాలు ఏర్పాటు చేయడం నిషిద్ధం. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతి తప్పనిసరి.
2) శబ్ద కాలుష్యం నియంత్రణ:ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దంతో డీజేలు వినియోగించడంపై నిషేధం. ప్రత్యేకంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 55 డెసిబెల్స్‌కి మించని శబ్దంతోనే ప్రదర్శనలు జరగాలి. డీజేలు లేదా ఇతర శబ్ద పరికరాల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి.
3) ఊరేగింపులు, సభలు:ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదు. 500 మందికి మించిన సమావేశాల కోసం సంబంధిత ఏ.సీ.పీ. అనుమతి తీసుకోవాలి. ఒకవేళ 500 మందికి పైగా హాజరయ్యే ఈవెంట్స్ కోసం 72 గంటల ముందు పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలి. లౌడ్ స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి.
4) సార్వజనిక ప్రదేశాల్లో ప్రవర్తన:మాల్స్, థియేటర్లు, హోటల్స్, ఎగ్జిబిషన్లు, బిజినెస్ సెంటర్లలో భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రజలు క్యూ పద్ధతిని పాటిస్తూ సహనంతో ఉండాలి
5) డ్రోన్ల వినియోగంపై నియంత్రణ:ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ వాడకాన్ని నియంత్రించాల్సి ఉంది. డ్రోన్ ప్రయోగించాలనుకుంటే సంబంధిత ప్రభుత్వ శాఖలు, పోలీసులు, ఏవియేషన్ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది
6) నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి:గల్ఫ్ ఉద్యోగాల పేరుతో పాస్‌పోర్టు, వీసా సేవలు అందిస్తున్నట్టు చెప్పి మోసాలు పెరుగుతున్నాయి. ఇలాంటివారికి ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పదంగా కనిపించిన ఏజెంట్ల వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
7) "A" సర్టిఫికెట్ సినిమాలు:“ఎ” సర్టిఫికెట్ ఉన్న చిత్రాలను మైనర్లు థియేటర్లలో చూడటాన్ని అనుమతించరాదు. థియేటర్లు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
8) బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం:పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మహిళలు, పిల్లలు, ఇతరులపై అసభ్య ప్రవర్తన పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రజా శాంతి భద్రత కోసం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించారు.